మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 27 : ఇంటర్మీడియట్ పరీక్ష లను సజావుగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి సత్యనారాయణ కోరారు. బుధవారం మెదక్‌లోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంట్ అధికారులు, పరీక్షల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే 6 నుంచి 21వ వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు జిల్లాలో 13,777 మంది హాజరవుతున్నారన్నారు.
ఫస్టియర్‌లో జనరల్ విద్యార్థులు 6,619 మంది, ఒకేషనల్ 640, సెకండియర్‌లో జనరల్ 6,032 మంది, ఒకేషనల్ విద్యార్థులు 486 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 29న జిల్లాకు ప్రశ్నాపత్రాలు వస్తాయని, జిల్లాలోని 13 పోలీస్స్టేషన్లలో వాటిని భద్రపరుస్తామన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే మొబైల్ యాప్‌లో సమాచారం ఇవ్వాలని, ఈ నెల 29న నిర్వహించ నున్న సమావేశంలో తెలియజేయాలని కోరారు.