నంగునూరు, మార్చి 8: సాగునీటి కోసం సిద్దిపేట జిల్లా నంగునూరు, ధూళిమిట్ట మండలాల రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రంగనాయకసాగర్ కుడి కాలువ నుంచి కోనాయపల్లి, తిమ్మాయిపల్లి, దానంపల్లి, నాగరాజుపల్లి గ్రామాల ద్వారా నంగునూరు వాగులోని చెక్‌డ్యామ్ నింపేందుకు కాలువ తీశారు. దానంపల్లి, కమలాయపల్లి మధ్యలో నుంచి నీటిని తరలించేందుకు ఎల్డీ-10 కాలువ నుంచి నీటిని మళ్లించేలా తాత్కాలిక జీవో తీసుకువచ్చి కాలువకు గండి కొట్టారు. దీంతో శనివారం నంగునూరు మాజీ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నంగునూరు మండలానికి చెందిన 11 గ్రా మాల రైతులు అక్కడికి చేరుకొని కాల్వ గండికొట్టడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా ఇరు మండలాల రైతుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. విష యం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తాత్కాలిక జీవోలో యాసంగి పంటకు మాత్రమే సాగునీరు తీసుకెళ్లాలని ఉండడంతో కేవలం కమలాయపల్లి గ్రామానికి మాత్రమే సాగునీరు మళ్లించాలని, అర్జున్‌పట్ల, ధూళిమిట్ట, లింగాపూర్, జాలపల్లి గ్రామాలకు ఈ కాలువ ద్వారా సాగునీటిని మళ్లించవద్దని రైతులు తేల్చి చెప్పారు. కుడి కాలువకు కొట్టిన గండిని మూసివేసి డిస్ట్రిబ్యూషన్ కాలువ ద్వారా చిన్న పైపు వేసుకొని మాత్రమే కమలాయపల్లి వరకు నీటిని మళ్లిస్తే తమకు అభ్యంతరం లేదని రైతులు తెలిపారు. దీంతో గొడవ సద్దుమణిగింది.
గండికొడితే ఊరుకోం: బీఆర్ఎస్ నాయకులు, రైతులు అనంతరం నంగునూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన రంగనాయకసాగర్ కాలువ ద్వారా నంగునూరు మండలంలోని 11 గ్రామాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఎల్డీ-10 కాలువను నిర్మించారన్నారు. భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి ఇటీవల కమలాయపల్లి గ్రామానికి వచ్చి ఎల్డీ-10 నుంచి అక్రమంగా గండి కొట్టే ప్రయత్నంలో భాగంగా తాత్కాలిక జీవో జారీ చేశారని ఆరోపించారు. ఈ జీవో ద్వారా నంగునూరు మండల రైతుల నోట్లో మట్టి కొట్టే కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలనలో రైతుల మధ్య వైషమ్యాలు పెంచి యుద్ధ్ద వాతావరణం నెలకొల్పే ప్రయత్నాలు చేయడం సమంజసం కాదన్నారు. కమలాయపల్లి గ్రామానికి మాత్రమే సాగునీరు ఇవ్వాలని, మిగతా గ్రామాలకు నీటిని మళ్లిస్తే ఊరుకోమని హెచ్చరించారు. అధికారం చేతిలో ఉందని తాత్కాలిక జీవోను శాశ్వత జీవోగా మార్చితే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నంగునూరు మాజీ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనగోని లింగంగౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ రాగుల సారయ్య, పీఏసీఎస్ చైర్మన్ కోల రమేష్‌గౌడ్, మాజీ రైతుబంధు సమితి మండల కన్వీనర్ కిష్టారెడ్డి, నాయకులు వేణు చక్రవర్తి, సిద్దు, రాము, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.