మెదక్, ఏప్రిల్1 (నమస్తే తెలంగాణ): రానున్న రెండు నెలలు పక్కా ప్రణాళికతో తాగునీటి సరఫరా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి తాగునీటి సరఫరా ప్రణాళిక, ధాన్యం కొనుగోలు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై సీఎస్ శాంతికుమారి, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో సమీకృత కలెక్టరేట్ నుంచి కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సరఫరాపై అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి, సిద్ధంగా ఉన్నామన్నారు. రోజూ నీటి సరఫరాను పర్యవేక్షించాలని, ప్రజలకు ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. తాగునీటి సరఫరా నిమిత్తం మిషన్ భగీరథతో అందుబాటులో ఉన్న వ్యవస్థను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానికంగా ఉన్న వ్వవసాయ మోటర్లను వినియోగించుకోవాలని అధికారులకు ఆదేశించారు. పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులున్న ప్రాంతాలకు ట్యాంకర్లతో నీటి సరఫరా సప్లిమెంట్ చేయాలన్నారు. నీటి సరఫరాలో ఉత్పన్నమయ్యే సమస్యలను వెంటనే గుర్తించి, వాటిని సత్వరం పరిష్కరించేలా చూడాలన్నారు. తాగునీటి సరఫరాను రోజూ పర్యవేక్షించాలని సీఎస్ పేర్కొన్నారు. ఎండ తీవ్రత ఎక్కువవుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు తగ్గి పోతున్నాయని, పట్టణాలు, నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో సైతం ట్యాంకర్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నదని సీఎస్ తెలిపారు. ట్యాంకర్ బుక్ చేసిన వెంటనే సకాలంలో నీళ్లు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మన రైతుల వద్ద నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా చెక్ పోస్టులను అప్రమత్తం చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరా, టెంట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో వరి సాగు చేస్తున్న రైతులకు సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ట్యాగింగ్ చేయాలన్నారు. ప్రణాళికాబద్ధంగా కొనుగోలు కేంద్రం వద్దకు రైతు ధాన్యం తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వానకాలం 2023-24కు సంబంధించి సీఎంఆర్ రా రైస్ డెలివరీ వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. భారత ఆహార సంస్థ నిర్దేశించిన సమయానికి రైస్ డెలివరీ చేసే విధంగా ప్రతి జిల్లాల్లో రైస్ మిల్లుల పని తీరును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్, డీఈవో రాధాకృష్ణ, డీపీవో యాదయ్య, డీఎంహెచ్‌వో శ్రీరాం, తదితరులు ఉన్నారు.
మెదక్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): ఊష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టర్, రమేశ్‌తో కలిసి ఎండ దెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించే పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎండలో బయట తిరగకుండా ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. అత్యవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు రాకూడదన్నారు. ఎండా కాలంలో నిలిపి ఉన్న వాహనాల్లో పెంపుడు జంతువులను వదలవద్దన్నారు. ఆల్కాహాల్, టీ, కాఫీ, స్వీట్స్, చల్లటి డ్రింక్స్ తీసుకోవద్దని, చెప్పులు లేకుండా బయట నడవద్దని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ సిబ్బంది శ్రీరాం, డీఆర్డీఏ శ్రీనివాస్‌రావు, డీపీవో యాదయ్య, డీఈవో రాధాకిషన్, అధికారులు పాల్గొన్నారు.