అమీన్‌ఫూర్ (జిన్నారం), జూలై 11: నిబంధనలు పాటించకుండా నిర్మిస్తున్న అపార్టుమెంట్లలో అనుమతులు లేకుండా సెల్లార్లు నిర్మిస్తున్నారు. దీంతో వర్షం పడుతున్న సమయంలో సెల్లార్లు నీటితో ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్, బీరంగూడ డివిజన్ల పరిధుల్లో వందల సంఖ్యలో అపార్టుమెంట్లు ఉన్నాయి. వానకాలం కావడంతో వర్షం పడ్డ సమయంలో సెల్లార్లలో నీళ్లు నిండుతున్నాయి. దీంతో సెల్లార్లో పార్కింగ్ చేసిన వాహనాలు నీట మునుగుతున్నాయి. దీంతో వర్షానికి ప్రజలు రోజుల తరబడి ఇబ్బందులు పడాల్సివస్తున్నది.
లాలాబాయికాలనీ, సీఎన్ఆర్ కాలనీ, అమీన్పూర్, బీరంగూడ ప్రధాన రహదారిపై అనేక అపార్టుమెంట్లు ఉన్నాయి. అమీన్‌ఫూర్, బీరంగూడ డివిజన్ పరిధుల్లో 200 వరకు అనుమతులు లేని అపార్టుమెంట్లు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అపార్టుమెంట్లపై అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి సెల్లార్లు వరదతో పూర్తిగా నిండిపోయాయి. మోటర్లతో నీటిని బయటకు పంపేందుకు మూడు రోజుల సమయం పట్టింది. వందల సంఖ్యలో వాహనాలు నీట మునిగాయి. సెల్లార్తలోకి నీరు వస్తే బయటకు పంపే ఏర్పాట్లు చేయా ల్సి ఉన్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అపార్టుమెంట్లలోని సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అనుమతులు లేకుండా సెల్లార్లు నిర్మిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వానకాలంలో సెల్లార్లలో నీళ్లు నిల్వ ఉండకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి. సెల్లార్లున్న భవనాలను అధికారులు పర్యవేక్షించి, ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి.
– కొండల్‌రెడ్డి, పీపుల్స్ అసోసియేషన్ చైర్మన్, అమీన్పూర్
సెల్లార్లలో నీరు నిండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విష యం మా దృష్టికి వచ్చింది. యజమానులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు చూపుతాం. నిబంధనలు పాటించని అపార్టుమెంట్లపై చర్యలు తీసుకుంటాం.
– ప్రదీన్కుమార్, డిప్యూటీ కమిషనర్, అమీన్‌ఫూర్