Damage Roads | గాంధారి: గాంధారి మండల కేంద్రం నుంచి లింగంపేట్కు వెళ్లే ప్రధాన రహదారి రోజురోజుకు అధ్వానంగా మారుతుంది. ముఖ్యంగా గుర్జల్ తండా గ్రామ పరిధిలో కొంతమంది రైతులు తమ వ్యవసాయ భూములకు దమ్ము (మట్టి) చేసే ట్రాక్టర్లు (Tractors), భారీ వ్యవసాయ వాహనాలను ప్రధాన రహదారిపైనే నడపటం వల్ల రోడ్డు తీవ్రంగా ధ్వంసమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాకపోకలకు అత్యంత కీలకమైన ఈ రహదారిపై గుంతలు ఏర్పడి అపాయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కారణంగా పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

Gurjal
గుర్జల్ తండా గ్రామపంచాయతీ (Grampanchayat) సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు దెబ్బతింటున్నప్పటికీ ట్రాక్టర్ల రాకపోకలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. ప్రధాన రహదారిని వ్యవసాయ పనుల కోసం ఉపయోగించడం వల్ల ప్రభుత్వ నిధులతో నిర్మించిన రహదారి త్వరగా పాడైపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రహదారిపై భారీ ట్రాక్టర్ల రాకపోకలను నియంత్రించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
దెబ్బతిన్న రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టి ప్రజలకు సురక్షితమైన ప్రయాణ (travel) సౌకర్యం కల్పించాలని, లేనిపక్షంలో ప్రజలు ఆందోళన కార్యక్రమాలకు దిగాల్సి వస్తుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. గాంధారి–లింగంపేట్ ప్రధాన రహదారిని పరిరక్షించడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత అని, అధికారులు ఇకనైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.