హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందక సాగుకు నీళ్లు లేకపోవడంతో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో మరో కౌలు రౌతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన శగ్గారి నరేందర్ గౌడ్(52) అనే రైతు తనకున్న రెండెకరాలతో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.
ఈ క్రమంలో పెట్టుబడి కోసం రూ.5 లక్షలు అప్పు చేశాడు. వేసిన రెండు బోర్లలో నీళ్లు రాకపోవడంతో పంటలు ఎండిపోయాయి. దీంతో చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో కౌడిపల్లి శివారులోని ఆలయం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నరేందర్ గౌడ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.