అమీన్పూర్, ఏప్రిల్ 3: ఆన్లైన్లో ఐపీఎల్ క్రికెట్ టోర్నీ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తిని అమీన్‌ఫూర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి సమయంలో ఐపీఎల్ క్రికెట్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్, బెంగళూర్, ముంబై ఇండియన్స్ టీంలపై ఆన్లైన్లో ఒక వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడనే సమాచారం మేరకు సిబ్బందితో కలిసి ఎస్సై సుభాశ్ సాయికాలనీ, బీరంగూడలోని కుంచాల జగదీశ్ ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో జగదీశ్ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని గుర్తించారు.
ఈ మేరకు ఇద్దరు పంచుల సమక్షంలో జగదీశ్‌ను అమీన్‌ఫూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగదీశ్ వద్ద ప్లాస్టిక్ కవర్లో రూ.7లక్షల 40వేల 5వందలు లభించాయి. రెండు లాంగ్నోట్ బుక్స్ బుకింగ్స్ వివరాలు రాసినవి, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు జగదీశ్‌పై పోలీసులు స్వయం ప్రేరిత కేసు నమోదు చేశారు. ఈ దాడిలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు బృందాన్ని శ్రీనివాసులు రెడ్డి అభినందించారు.