సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ ఒకప్పుడు సాధారణ గ్రామ పంచాయతీ, నేడు హైదరాబాద్ మహానగరంలో విలీనమైంది. తొలుత గ్రామ పంచాయతీగా ఉన్న అమీన్పూర్, ఆ తర్వాత మున్సిపల్‌గా మారింది. ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలిసి అభివృద్ధిలో ప్రయనిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో అమీన్పూర్ వేగంగా అభివృద్ధి చెందింది. అనేక కొత్త కాలనీలు వెలువడంతో జనాభా విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో పట్నానికి మరింత చేరువైంది.
జిన్నారం(అమీన్పూర్), జనవరి 8: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ గ్రామ పంచాయతీగా ఉండేది. 1956లో అమీన్పూర్ బందంకొమ్ము, బీరంగూడ, ఉష్కెబావి, నర్రిగూడెం గ్రామంతో కలిసి గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. అప్పట్లో గ్రామ పంచాయతీ జనాభా కేవలం 10 వేల వరకు మాత్రమే ఉండేది. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో అప్పటి నుంచి నేటి వరకు అమీన్పూర్ అభివృద్ధి చెందుతూ వచ్చింది. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ హయాంలో (2018 ఆగస్టు 2న) అమీన్పూర్ నూతన మున్సిపాలిటీగా ఏర్పాటైంది. అప్పట్లో మున్సిపల్ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. పటేల్‌గూడ, ఐలాపూర్, ఐలాపూర్తండా, కిష్టారెడ్డిపేట, సుల్తాన్పూర్, దాయర, జానకంపేట, వడక్పల్లి గ్రామాలను కలుపుతూ కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది.
బీఆర్ఎస్ హయాంలోనే రియల్ వ్యాపారం జోరుగా సాగడంతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. కిష్టారెడ్డిపేట నుంచి బీరంగూడ కమాన్ వరకు నూతనంగా బీఆర్ఎస్ హయాలో రోడ్డు వేయడంతో అభివృద్ధి పరుగులు పెట్టింది.దీంతో పాటు సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజెస్ పార్కు రావడంతో ఉపాధి అవకాశాలు వేల సంఖ్యలో లభించాయి. ఓఆర్ఆర్కు సమీపంలో అమీన్పూర్ ఉండటం, యువతకు ఉపాధి అవకాశాలు రావటంతో అనేక కొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. రోడ్డుకు ఇరువైపులా అనేక నూతన భవనాల నిర్మాణం కొనసాగింది.
కేవలం 50వరకు ఉన్న కాలనీల సంఖ్య ప్రస్తుతం రెండు వందలకు చేరుకుందంటే అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం అమీన్పూర్ పరిధిలో సుమారు 3 లక్షల వరకు జనాభా ఉంటుంది. మున్సిపల్ పదవీ కాలం తర్వాత డిసెంబర్ 3, 2025లో అమీన్పూర్ను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలే అభివృద్ధికి అడుగులు పడ్డాయని స్థానికులు గుర్తుచేస్తున్నారు. గ్రామ పంచాయతీగా ఉన్న అమీన్పూర్ జీహెచ్ఎంసీ స్థాయికి చేరడంతో రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి
బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న అనేక నిర్ణయాలతో అమీన్పూర్ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు ప్రజలు పొందుతున్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మరింత అభివృద్ధి జరగడం ఖాయం.
– పాండురంగారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్, అమీన్పూర్
అమీన్పూర్ సర్కిల్ పేరు మార్చాలి
రామచంద్రాపురం, జనవరి 8: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్కిల్ పేరు మార్చడం లేదా సర్కిల్ కార్యాలయాన్ని ఆర్సీపురానికి తరలించాలని కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ని భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డి కోరారు. గురువారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో కమిషనర్‌ను ఆమె కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్సీపురం జాతీయ రహదారికి ఆనుకొని ఉండడంతో పాటు బీరంగూడ కమాన్ పక్కనే ఎంపీడీవో కార్యాలయం ఉందన్నారు.
రవాణా సౌకర్యం, మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్లకు సంబంధించిన వృద్ధులు, దివ్యాంగులు, ప్రజలు బల్దియా సేవలు పొందడం మరింత సులభమవుతుందని పేర్కొన్నారు. అమీన్పూర్లో సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేయడంతో ఇక్కడి ప్రజలు దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండడంతో చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ఆర్సీపురం డివిజన్లోని ఎంపీడీవో కార్యాలయంలో సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేస్తే భారతీనగర్, ఆర్సీపురం, అమీన్పూర్, బీరంగూడ డివిజన్ల ప్రజలకు మేలు జరుగుతుందని ఆమె వివరించారు.