సంగారెడ్డి ఆగస్టు 21(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో గత ప్రభుత్వాలు స్వాతంత్య్రసమరయోధులు, మాజీ సైనికులకు నిబంధనల మేరకు ఐదు నుంచి పది ఎకరాల వరకు భూములు కేటాయించాయి. అమీన్‌పూర్‌లోని సర్వే నంబర్ 993తో పాటు వేర్వేరు సర్వే నంబర్లలో స్వాతం త్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు భూము లు ఇచ్చారు. ఈ భూముల క్రయవిక్రయాలు జరుకొకునేలా ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్వోసీలు జారీ అయ్యాయి. దీంతో స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించిన భూముల్లో కొత్తగా కాలనీలు ఏర్పడి వందలాది నివాసగృహాలు వెలిశాయి. స్వాతంత్య్రసమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించిన భూములను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. దీంతో 10కిపైగా కాలనీలు నిషేధిత జాబితాలో చేరాయి.
నిషేధిత జాబితాలో చేరిన కాలనీవాసులంతా రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 నుంచి 30 ఏండ్ల క్రితం అన్ని అనుమతులతో ఏర్పాటైన తమ కాలనీలను 22-ఏ జాబితాలో చేర్చడం ఏమిటని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించిన భూములను 22ఏ జాబితాలో చేర్చటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. పది మందికిపైగా స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించిన భూములు 22 ఏజాబితాలో చేర్చడంతో వారంతా కలెక్టర్‌ను కలిసి 22ఏ జాబితా నుంచి తమ సర్వేనంబర్లు తొలిగించాలని కోరారు. ఈ విజ్ఞప్తులు పరిశీలిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
పటాన్చెరు నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నేతల వ్యవసాయేతర భూములతోపాటు వారి సమీప బంధువుల భూములు సైతం 22-ఏ నిషేధిత జాబితాలో చేరాయి. వ్యవసాయేతర భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన వెం చర్లు, కాలనీలు, నివాస గృహాలను నిషేధిత జాబితాలో చేర్చడంపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఓ ముఖ్యమైన కాంగ్రెస్ నేత బాబాయి నడుపుతున్న బార్ అండ్ రెస్టారెంట్, మరో వ్యా పార కేంద్రం ఉన్న నాలుగు ఎకరాల స్థలం, వెయ్యి గజాలకుపైగా స్థలాన్ని 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చారు.
తమ ప్రభుత్వమే తమ కుటుంబానికి చెందిన ఆస్తులను 22-ఏ జాబితాలో చేర్చడంపై కాంగ్రెస్ ముఖ్యనేత మండిపడుతున్నారు. విషయాన్ని ఓ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పటాన్‌చెరుకు చెందిన మరో కాంగ్రెస్ నేత రెండేండ్ల క్రితం బీరంగూడ, అమీన్పూర్లో వెంచర్లు ఏర్పాటు చేశారు. సుమారు పది ఎకరాల్లో ఏర్పాటు చేసిన వెంచర్లు 22-ఏ జాబితాలో చేర్చారు. దీంతో సదరు కాంగ్రెస్ నేత ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
అమీన్పూర్, బీరంగూడలోని పలు సర్వేనంబర్లు 22-ఏ నిషేధితజాబితాలో చేర్చారు. ముఖ్యంగా సర్వేనంబర్ 993/4, 993/46, 993/45, 993/49అ, 343, 594, 946, 662, 103/అ, 622/అ, 343/6-9 తదితర సర్వే నంబర్లలోని సుమారు 200 ఎకరాల భూముల్లో ఏర్పాటైన కాలనీలు, నివాస గృహాలను 22-నిషేధిత జాబితాలో చేర్చారు. బీరంగూడలో 35 ఏండ్ల క్రితం ఏర్పాటైన ఇక్రిశాట్ కాలనీ సైతం 22-ఏ జాబితాలో చేర్చారు. ఇదే ఇక్రిశాట్ కాలనీలోని కమ్యూనిటీహాల్లో ప్రస్తుతం అమీన్పూర్ పోలీస్టేషన్ కొనసాగుతుంది. అమీన్పూర్ పోలీస్టేషన్ సైతం 22-ఏ జాబితాలో చేరింది. అమీన్పూర్, బీరంగూడతో పాటు జిన్నారం, గుమ్మడిదల, రామచంద్రాపురంలోని వందలాది వ్యవసాయేతర భూములు నిషేధిత జాబితాలో చేర్చడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే 22ఏ నిషేధిత జాబితాలో తమ గృహాలు, కాలనీలను చేర్చిందని సామాన్యులు మండిపడుతున్నారు.