బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఇంటి ముందు కార్ఖానా సీఐ అనురాధ వీరంగం సృష్టించారు. క్రిశాంక్ ఇంట్లో లేని సమయంలో ఆయన నివాసానికి వచ్చిన సీఐ రెచ్చిపోయారు. మా ఆయన లేడని చెప్పినా వినకుండా క్రిశాంక్ సతీమణి సుహాసిని, ఇంటి పనివారితో ఆమె వాగ్వాదానికి దిగారు. లోపలేస్తా నా కొడకా అంటూ పనివాళ్లను దూషించారు.
మంగళవారం ఉదయం క్రిశాంక్ ఇంటి ముందు చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంట్లో చిన్న పాప ఉంది.. నా భర్త ఇంట్లో లేడని సుహాసిని చెప్పినప్పటికీ వినకుండా ఇంట్లోకి వస్తానంటూ సీఐ పట్టుబట్టడం వీడియోలో కనిపిస్తోంది. అలాగే ఆవేశంతో రెచ్చిపోయిన సీఐ.. క్రిశాంక్ ఇంట్లో పనివాళ్లపై బూతులతో చెలరేగారు. లోపలేస్తా నా కొడకా.. తమాషా చేస్తున్నారా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
మంగళవారం ఉదయం నుంచే పోలీసులు బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తున్నారు. సోమవారం అసెంబ్లీ వద్ద జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో తెల్లవారుజామునే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిని పోలీసులు వారి నివాసాల నుంచి అరెస్టు చేశారు. ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో పోలీసులు పెద్ద సంఖ్యలో వారి ఇళ్లకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి బీఎన్ఎస్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇలా ఒకవైపు అసెంబ్లీ ఘటనపై కేసులు, మరోవైపు తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్ నేతల అరెస్టులు జరుగుతున్న సమయంలోనే క్రిశాంక్ ఇంటి వద్ద సీఐ అనురాధ వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో బయటకు రావడం చర్చకు దారితీసింది.