పారిస్: గత వారం పారిస్‌లోని ఈఫిల్ టవర్(Eiffel Tower)ను ఓ హిందూ సంస్థకు చెందిన సాధువులు విజిట్ చేశారు. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న మహిళా సిబ్బందిని విధుల నుంచి తప్పించారు. ఈ చర్యలను ఖండిస్తూ ఈఫిల్ టవర్లోని ఉద్యోగులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈఫిల్ టవర్‌ను మూసివేశారు. శనివారం జరిగిన ఘటన గురించి ఉద్యోగులు మీటింగ్ నిర్వహించారు. బోచసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్తాన్ (బీఏపీఎస్) సంస్థకు చెందిన సుమారు 100 మంది హిందూ సాధవులు ఈఫిల్ టవర్‌ను సందర్శించారు. ఆ సందర్శన సమయంలో మహిళా ఉద్యోగులను విధులకు దూరంగా ఉంచారు. హిందూ సాధువులకు మహిళలు కనబడాకుండా ఉండేందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు.
హిందూ సాధువుల బృందం వచ్చిన సమయంలో పురుషులను విధుల్లోకి తీసుకున్నట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధి డయాన్ డావోని తెలిపారు. మహిళా సిబ్బందిని తప్పించిన అంశంపై మేనేజ్మెంట్తో చర్చలు జరిపారు. మళ్లీ ఇలా జరగకుడదని మేనేజ్మెంట్తో సిబ్బంది పేర్కొన్నది. ఆ ఘటన పట్ల సిబ్బందికి మేనేజ్మెంట్ క్షమాపణలు చెప్పింది. ఈఫిల్ టవర్ వద్ద జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టనున్నట్లు పారిస్ మేయర్ ఎమ్మాన్యువల్ గ్రెగరి తెలిపారు.
ఉద్యోగుల ఆగ్రహాన్ని అర్థం చేసుకున్నామని, వారి మనస్తాపం వాస్తవమైందే అని గ్రెగరి అన్నారు. ఈ ఘటనకు చెందిన అన్ని అంశాలు తెలవాల్సిందే అని పేర్కొన్నారు. ఇటీవల పారిస్ శివారు ప్రాంతంలో ఓ హిందూ ఆలయాన్ని ఓపెన్ చేశారు. ఆ గుడి ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు హిందూ సంస్థకు చెందిన సాధువులు పారిస్‌కు చేరుకున్నారు. అయితే ఆ బృందం సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో ఇతరులకు ఇబ్బంది కలిగించరాదన్న ఉద్దేశంతో ఈఫిల్ టవర్ వద్ద ఏర్పాట్లు చేశారు. ఆ బృందం రాక సమయంలో ఎవరికీ ఎటువంటి అడ్డు కలిగించలేదని ఈఫిల్ టవర్ మేనేజ్మెంట్ తన ప్రకటనలో తెలిపింది.
అతిథులను ఆహ్వానించడం అంటే మన విలువల్ని పోగొట్టుకోవడం కాదు అని, ఫ్రాన్స్‌లో మహిళలు ప్రజాజీవితంలో సంపూర్ణంగా ఉంటారని, ఒకరి కోసం వాళ్లను అదృశ్యం కావాలని చెప్పరని నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యేట్ బ్రాన్ పివెట్ తెలిపారు.