Nora Fatehi | బాలీవుడ్ నటి, ప్రముఖ డ్యాన్సర్ నోరా ఫతేహికి ఊహించని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఓ చార్టర్డ్ విమానానికి సంబంధించి ఆమె సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారితీశాయి. తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా నోరా వ్యాఖ్యలు చేశారంటూ డ్యూన్స్ ఏవియేషన్ గుజరాత్‌లోని గాంధీనగర్ కోర్టును ఆశ్రయించింది. ఏకంగా రూ.3 కోట్ల పరువు నష్టం కోరుతూ దావా దాఖలు చేసినట్లు సమాచారం. గత డిసెంబరులో నోరా ఫతేహి ముంబై నుంచి జైపూర్‌కు ప్రయాణించారు. ఈ సందర్భంగా డ్యూన్స్ ఏవియేషన్‌కు చెందిన సెస్నా సైటేషన్ CJ2 చార్టర్డ్ విమానంలో ఆమె ప్రయాణించినట్లు తెలుస్తోంది.ప్రయాణ సమయంలో విమానం లోపల కొన్ని వీడియోలను నోరా ఫతేహి చిత్రీకరించి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
ఆ వీడియోల్లో విమానం గురించి ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలే ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారాయి. విమానాన్ని నోరా ఫతేహి ‘చిన్న బొమ్మ’, ‘లెగో ఏరోప్లేన్’, ‘టాయ్ ప్లేన్’ వంటి పదాలతో అభివర్ణించినట్లు కంపెనీ ఆరోపిస్తోంది. ఆమెకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉండటంతో ఈ వీడియోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. దీంతో తమ విమానయాన సంస్థపై ప్రయాణికుల్లో అనుమానాలు ఏర్పడి, సంస్థ ప్రతిష్టకు నష్టం వాటిల్లిందని డ్యూన్స్ ఏవియేషన్ కోర్టులో పేర్కొన్నట్లు సమాచారం.నోరా చేసిన వ్యాఖ్యల ప్రభావంతో తమ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడిందని డ్యూన్స్ ఏవియేషన్ ఆరోపించింది. ముఖ్యంగా వీడియోలు వైరల్ అయిన తర్వాత తమ విమానాల బుకింగ్స్ 15 నుంచి 20 శాతం వరకు తగ్గాయని, కొంతమంది ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.
అయితే ఇవన్నీ ప్రస్తుతం కంపెనీ కోర్టులో చేసిన ఆరోపణలు మాత్రమే. ఈ ఆరోపణలపై తుది నిర్ణయం కోర్టు విచారణ అనంతరం వెలువడాల్సి ఉంటుంది. తమ విమానం పూర్తిగా సురక్షితమైనదని డ్యూన్స్ ఏవియేషన్ స్పష్టం చేసినట్లు సమాచారం. విమానానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) గుర్తింపు ఉందని, చెల్లుబాటు అయ్యే నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్స్ పర్మిట్ (NSOP) కింద చట్టబద్ధంగానే సేవలు అందిస్తున్నామని సంస్థ కోర్టుకు తెలిపినట్లు తెలుస్తోంది. విమానయాన రంగానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై సరైన అవగాహన లేకుండా, వాస్తవాలను ధృవీకరించకుండా నోరా వ్యాఖ్యలు చేశారని కంపెనీ తన పిటిషన్లో పేర్కొన్నారు. కేవలం రూ.3 కోట్ల నష్టపరిహారంతో ఆగకుండా.. నోరా ఫతేహి సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన సంబంధిత వీడియోలను తొలగించాలని కూడా డ్యూన్స్ ఏవియేషన్ కోరినట్లు తెలుస్తోంది.