రాయపోల్, నవంబర్ 2 : ప్రమాదాలకు గురైన బాధితలను ప్రాణాపాయ స్థితిలో అత్యవసర సేవలందించేందుకు 108 అంబులెన్స్ లేక సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సాధారణంగా ప్రతి మండలానికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు దాని పరిధిలోని ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నది. గతంలో ఉమ్మడి దౌల్తాబాద్‌కు అంబులెన్స్‌ను కేటాయించింది. ఏడేండ్ల క్రితం రాయపోల్ మండలంగా ఏర్పడినా ఇంతవరకు అంబులెన్స్ కేటాయించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాయపోల్ మండలంలోని 19 గ్రామ పంచాయతీలు, 3 మధిర గ్రామా లు ఉన్నాయి. 22 వేల జనాభా ఉంది.అత్యవసర సమయాల్లో దవాఖానలకు క్షతగాత్రులను, బాధితులను తరలించాలంటే పక్క మండలాల నుంచి అంబులెన్స్ వచ్చేవరకు నష్టం జరుగుతున్నది. మండలంలో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అంబులెన్స్ లేక జరుగుతున్న నష్టం ప్రజలకు అర్థమవుతున్నది. రాయపోల్ మండల కేంద్రం సమీపంలో మూలమలుపుల వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఆటో బోల్తాపడి పలువురికి గాయాలయ్యాయి.
108కి ఫోన్ చేసినా గంట వరకు వాహనం రాకపోవడంతో ఆటోలోనే క్షతగాత్రులను తరలించారు. అత్యవసర సమయల్లో గజ్వేల్, హైదరాబాద్ దవాఖానలకు తరలించడానికి అంబులెన్స్ లేక ప్రైవేట్ వాహనాలు, కార్లు, ఆటోలను బాధితులు ఆశ్రయిస్తున్నారు. దీంతో పేదలపై ఆర్థిక భారం పడుతున్నది. ప్రజాప్రతినిధులు,అధికారులు స్పందించి తక్షణమే రాయపోల్ మండలానికి 108 వాహనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై గతంలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య పమావేశాల్లోనూ ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు లేవనెత్తారు.