మద్దూరు(ధూళిమిట్ట), నవంబర్ 3: వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు ఆగమైతుంటే సీఎం రేవంత్‌రెడ్డి సల్మాన్‌ఖాన్‌తో ఫొటోలకు పోజులిస్తున్నాడని, ఫొటోలకు పోజులివ్వడం మానుకొని రైతుల కష్టాలు తెలుసుకోవాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హితవు పలికారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూర్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను స్థానిక బీజేపీ నాయకులతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన మొంథా తుపాన్‌తో పాటు ఆగస్టు, సెప్టెంబర్‌లో కురిసిన అకాల వర్షాల వల్ల లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, లక్షలాది మంది రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఓవైపు పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనతో పాటు పెండ్లీలు, పేరంటాలంటూ పబ్బం గడుపుతున్నాడని ఎద్దేవా చేశారు.
రైతులు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. మొన్న నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ. 10వేలు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినా ఏ ఒక్క రైతు ఖాతాలో నేటికీ డబ్బులు జమకాలేదన్నారు. కేవలం పేపర్ స్టేట్మెంట్లకే పరిమితమైన రేవంత్‌రెడ్డి రైతులపై మొసలి కన్నీరు కార్చుతూ గాలిమోటర్లలో తిరుగుతూ గాలిమాటలతో పబ్బం గడుపుతున్నాడని మండిపడ్డారు. రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్‌రెడ్డికి లేదన్నారు. రైతు డిక్లరేషన్ పేరుతో కర్షకులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గతంలో ఒక సీజన్లో రైతు బంధు ఎగ్గొట్టిన రేవంత్‌రెడ్డి, రైతుల పంటరుణమాఫీని కూడా విస్మరించినట్లు ధ్వజమెత్తారు. ఫసల్‌బీమాలో భాగస్వామ్యమైతే రైతులకు కేంద్రం ద్వారా కొంత బీమా డబ్బులు అందేవన్నారు. తాము ఎక్కడికి వెళ్లినా రైతులు తమ బాధలు చెప్పుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారన్నారు.
నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 30వేల నష్టపరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్, రాష్ట్ర నాయకుడు అంకుగారి శశిధర్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంగోని సురేశ్‌గౌడ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి, బీజేపీ జిల్లా కార్యదర్శి కూరెళ్ల రాజుగౌడ్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు సోగాల మనోజ్‌కుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు మోకు ఉదయ్‌రెడ్డి, జిల్లా నాయకుడు రాపాక బుచ్చిరెడ్డి, కర్రె వీరన్న, మేక సుధర్మ, బొంగోని బాలు, రవీందర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.