సిద్దిపేట, జూలై 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని రెవెన్యూశాఖలో అవినీతి ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ దిలీప్‌నాయక్ రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు సోమవారం పట్టుబడటం ఉమ్మడి జిల్లాల్లో చర్చకు దారితీసింది. ఈ ఘటనతో తహసీల్దార్ కార్యాలయాల పనితీరుపై ప్రజల్లో మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూ సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, వారసత్వ మార్పులు, ఎన్వోసీలు, భూ రికార్డుల సవరణలు, ఇతర రెవెన్యూ సేవల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజల నుంచి పనిని బట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బు ఇస్తేనే పని.. లేకపోతే ఫైల్ పెండింగ్ అనే పరిస్థితి నెలకొన్నది.
చేర్యాల ఘటన ఒకటే కాదు గతంలో కూడా ఉమ్మడి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఏసీబీకి చికినా అవినీతికి అడ్డుకట్ట పడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఏసీబీ దాడులు, కేసులు నమోదవుతున్నా కొందరు అధికారులు తీరు మార్చుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నారు. చివరకు మధ్యవర్తుల ద్వారా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తోందని వారు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ సేవలపై ప్రజల్లో నమ్మకం దెబ్బతింటున్నది. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాల్సిన రెవెన్యూశాఖలో అవినీతి ఆరోపణలు పెరుగుతుండటంపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. తరచూ తనిఖీలు నిర్వహించడం, ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవడం, అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది.
రెవెన్యూ లీలలపై చర్చ
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రెవెన్యూ వ్యవస్థ గాడి తప్పింది. పైసలు లేనిది ఏపని కూడా కావడం లేదు. చాలా గ్రామాలు, మండలాల్లో జీపీవోలు, సర్వేయర్లు, ఆర్ఐలు, డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లు ఇలా ప్రతి రెవెన్యూ అధికారి ఎవరి స్థాయిలో వారు డబ్బులు వసూలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో తహసీల్దార్ దిలీప్‌నాయక్ లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన రెవెన్యూశాఖలో సంచలనం సృష్టించింది.
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగపురి గ్రామానికి చెందిన సర్వే నంబర్లు 833/బీ, 833/సీ 833/డీ, 833/ఈ, 834/బీ, 834/సీ, 834/డీ, 834/ఈ పరిధిలోని మొత్తం 30 గుంటల భూమికి సంబంధించి 11 నాలా కన్వర్షన్ దరఖాస్తులను ప్రాసెస్ చేసి అధికారిక అనుమతులు మంజూరు చేయడానికి తహసీల్దార్ లంచం డిమాండ్ చేశాడు. ఈ దరఖాస్తుల్లో ఇప్పటికే 8 దరఖాస్తులు ప్రాసెస్ చేయగా, మిగిలిన ప్రక్రియ పూర్తి చేయడానికి రూ.70 వేలు లంచం తీసుకున్నాడు. ఈ మధ్య కాలంలో జిల్లాలో పలువురు అధికారులు ఏసీబీకి పట్టుబడుతుండటమే ఇందుకు నిదర్శనం అని చెప్పవచ్చు. కిందిస్థాయి నుంచి పై స్థాయి అధికారి దాకా ఎవరిచేతి వాటం వారు ప్రదర్శిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఉచితంగా చేయాల్సిన పనులకు ధరలు నిర్ణయించి అందుకు అనుగుణంగా వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సిద్దిపేట జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు
చేర్యాల తహసీల్దార్ నాలా కన్వర్షన్ కోసం రూ. 70 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. గజ్వేల్ తహసీల్దార్ శ్రవణ్‌కుమార్ ఆదాయం మించి ఆస్తులు ఉన్నాయన్న అభియోగంపై కరీంనగర్‌లోని ఆయన ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి నగదు, విలువైన డాక్యుమెంట్లు, ఇతర వాటిని సీజ్ చేసిన విషయం తెలిసిందే. రెండేం డ్ల కిందట ములుగు తహసీల్ కార్యాలయంలో రైతు నుంచి ఆర్ఐ నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆరునెలల కిందట ములుగు తహసీల్దార్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. రైతు పౌతి విషయంలో అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో డిప్యూటీ తహసీల్దార్‌ను జిల్లా కలెక్టరేట్‌కు అటాచ్ చేశారు.
వర్గల్ తహసీల్దార్ కార్యాలయంలో రైతు ప్రమేయం లేకుండానే అతడి వ్య వసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేసి న సంఘటన కలకలం రేపింది. ఈ విషయంలో తహసీల్దార్ రఘువీర్, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్‌రెడ్డిపై స్థానిక పీఎస్‌లో కేసులు నమోదు చేసి ఇద్దరినీ విధుల నుంచి సస్పెండ్ చేశారు. మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం మండలంలో నకిలీ ధృవపత్రాలతో పెద్దసంఖ్యలో అక్రమ రిజిస్ట్రేషన్లు, పౌతీలు జరిగినట్లు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. సంగారెడ్డి జిల్లాలో రోజురోజుకూ రెవెన్యూ అధికారుల అవినీతికి అంతంలేదు. వందల కోట్ల విలువ చేసే భూములు అప్పనంగా కట్టబెడుతున్నారు. ఇటీవల సదాశివపేట మండలంలో కోట్ల విలువైన భూములకు క్లియరెన్స్ ఇచ్చినట్లు సమాచారం.
నంగునూరు తహసీల్ కార్యాలయంపై ఆరోపణలు
సిద్దిపేట జిల్లా నంగునూరు తహసీల్ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఇసుక రవాణాకు అనుమతుల పేరిట ట్రాక్టర్ల యజమానుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి రెవెన్యూ అధికారులకు ముట్టిజెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే కాకండా వివిధ గ్రామాల నుంచి పనుల నిమిత్తం వచ్చిన వారి వద్ద నుంచి పనులు చేయించడానికి అక్కడ తిష్టవేసిన ముఠా పనిని బట్టి డబ్బులు వసూలు చేసి వాటాలు పంచుకుంటున్నాయి. డబ్బులు ఇస్తే ఏ పనైనా ఇట్టే చేసిపెడుతున్నారు.
ప్రధానంగా భూ సమస్యలు, వారసత్వ మార్పులు, భూ రికార్డుల సవరణలు, ఇతర రెవెన్యూ సేవల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజల నుంచి.. పనిని బట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బు ఇస్తేనే పని.. లేకపోతే ఫైల్ పెండింగ్ అనే పరిస్థితి నెలకొన్నది. ఇటీవల మండలంలోని ఓ గ్రామానికి నాలా కన్వర్షన్ నిమిత్తం వెళ్లిన రెవెన్యూ అధికారులపై గ్రామస్తులు తీరుగుబాటు చేశారు. ఇటీవల ఓ రైతు తనకు అన్యాయం జరిగిందని తహసీల్ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపాడు.
తహసీల్దార్ల కనుసన్నల్లోనే..

Medak3
భూభారతి చట్టం ద్వారా భూముల రికార్డులు సులభతరంఅవుతాయని ఆశించిన ప్రజలకు ఇప్పుడు అదే వ్యవస్థ కష్టాలు తెచ్చిపెడుతున్నది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని అనేక మండలాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కుకావడంతో ఫేక్ రిజిస్ట్రేషన్లు, భూ ఆక్రమణలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు, ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. విలువైన భూములను దళారులు కొట్టేస్తున్నారు. తహసీల్దార్లు, కంప్యూటర్ ఆపరేటర్లు దళారులతో కుమ్మక్కై భూభారతి పోర్టల్‌లో భూమి వివరాలు మారుస్తున్నారు.
ఇటీవల జిల్లాలో జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం అని చెప్పాలి. భూభారతి చట్టం ద్వారా పారదర్శకత పెంచాలనే లక్ష్యం ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అవినీతి ఆలక్ష్యాన్ని దెబ్బతీస్తోంది. జిల్లాలోని మెజార్టీ మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లోని అధికారులపై అనేక ఆరోపణలు ఉన్నాయి. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్, విస్తీర్ణంలో వ్యత్యాసాలు, సాధారణ భూముల రిజిస్ట్రేషన్లలో మధ్యవర్తుల ద్వారా లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా కార్యాలయాల్లో సర్వేయర్లపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే రైతుల నుంచి భూ భారతి ఆపరేటర్లు అందినకాడికి దోచుకుంటున్నారు.