హుస్నాబాద్, డిసెంబర్ 3: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బుధవారం జరిగిన సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభతో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచే హుస్నాబాద్ డిపోకు చెందిన దాదాపు అన్ని బస్సులను సీఎం సభకు జనాన్ని తరలించేందుకు తరలించారు. దీంతో వివిధ రూట్లలో వెళ్లే ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. కొందరు ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్‌లో బస్సుల కోసం వేచి ఉన్నారు.
ఉద్యోగ, వ్యాపార రీత్యా హుస్నాబాద్ నుంచి కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఒకటి రెండు బస్సులను మాత్రమే ఆర్టీసీ అధికారులు నడపడంతో బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణం చేశారు. అభివృద్ధి, రెండేండ్ల ఉత్సవాల పేరుతో బుధవారం హుస్నాబాద్‌లో జరిగిన సీఎం బహిరంగ సభ ప్రజలను ఇబ్బందులు పాలు చేయడానికేనా పెట్టినట్లు ఉందని భారతీయ కిసాన్ సంఘం డివిజన్ ఇన్చార్జి కవ్వ వేణుగోపాల్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు.