రాయపోల్, డిసెంబర్ 22 : మల్లన్నసాగర్లో పుష్కలంగా నీళ్లు ఉన్నా రైతులకు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. అదివారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని తిమ్మక్కపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు గుర్తుచేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ జలభాండాగారంగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా గెలువగానే ఏడాది క్రితం నుంచి మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ నుంచి ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా పిల్ల కాల్వలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. పిల్ల కాల్వలు పూర్తి చేస్తే చెరువులు నింపి రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అసంపూర్తిగా ఉన్న కాల్వల నిర్మాణాలను పక్కన పెట్టి హైదరాబాద్‌కు నీళ్లు తీసుకుపోవడానికి పనులు చేపడుతున్నారని, వీరికి రైతుల మీద ఎంతప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. ఉన్న కాల్వల్లో గడ్డి, చెత్తాచెదారం, నాచుతో పచ్చిగడ్డి ఏపుగా పెరిగిందన్నారు.
ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితి ఏర్పడటంతో యాసంగి సాగు ప్రశ్నార్థకరంగా మరిందన్నారు. యాసంగి వరకు కాల్వలు నిర్మించి సాగునీళ్లు విడుదల చేయకపోతే పంటపొలాలు ఎండిపోవడం ఖాయమన్నారు. ఒక గుంట పొలం ఎండినా అది ప్రభుత్వ వైఫల్యమే అవుతుందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో కాల్వలు పూర్తి చేసి చెరువులు, కుంటలు, పంటపొలాలకు సాగునీరు విడుదల చేయాలని, లేనిపక్షంలో హైదరాబాద్‌కు మల్లన్నసాగర్ నుంచి తరలించే నీటిని వేలాది మంది రైతులతో కలిసి అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మనోహరావు, పార్టీ రాయపోల్, తొగుట మండలాల అధ్యక్షులు వెంకటేశ్వరశర్మ, జీడిపల్లి రాంరెడ్డి, మాజీ జడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి, రాష్ట్ర యువజన నాయకులు కాడి రాజిరెడ్డి, ఇప్ప దయాకర్, శ్రీనివాస్, మాజీ సర్పంచ్‌లు రాజిరెడ్డి, రామచంద్రంగౌడ్, రాజిరెడ్డి, మురళీగౌడ్, నీవన్గౌడ్ పాల్గొన్నారు.