మెదక్ మున్సిపాలిటీ/సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 3 : పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదినీ ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై బుధవారం కలెక్టర్లు, ఎన్నికల సాధారణ పరిశీలకులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మెదక్ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతి, కలెక్టర్ రాహుల్ రాజ్ ఎస్పీ శ్రీనివాస్‌రావు,అదనపు కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా రెవెన్యూ అధికారి భుజంగరావు, డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లో నోడల్ అధికారులు, ఎన్నికల విభాగం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య, స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు ఎస్పీ రఘునందన్ రావు, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు కార్తీక్‌రెడ్డి, వ్యయ పరిశీలకుడు రాకేశ్, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, నోడల్ అధికారులు వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాణీ కుముదినీ మాట్లాడుతూ.. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు పొందేలా రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియామవళి పక్కాగా అమలు చేయలన్నారు. ఎలాంటి ప్రలోభాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు.అభ్యర్థుల గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పేపర్లపై ముద్రణ నిబంధనల ప్రకారం పూర్తిచేయాలని సూచించారు. సింగిల్ నామినేషన్ వచ్చిన గ్రామాలు ఉంటే అండర్ టేకింగ్ తీసుకోవాలని, సర్పంచ్ పదవుల వేలం ప్రకటన ఎక్కడ జరిగినా కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓటర్ స్లిప్పుల పంపిణీకి షెడ్యూల్ తయారు చేయాలని, ఓటు ప్రాముఖ్యతపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
అవసరమైన వసతులు కల్పిస్తున్నాం: భారతి లక్పతి
పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పిస్తున్నామని ఎన్నికల సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినికి తెలిపారు. నిబంధనల ప్రకారం స్క్రూట్నీ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పత్రాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈనెల 6న పోలింగ్ సిబ్బందికి శిక్షణ, పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. మెదక్ ఎస్పీ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు తెలిపారు. అంతర్ జిల్లాల చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశామని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు సిద్ధం: సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య
జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంసిద్ధ్దంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదినితో వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. మొదటి, రెండో విడత నామినేషన్ల ప్రక్రియ విజయవంతంగా చేపట్టినట్లు తెలిపారు.