పటాన్చెరు రూరల్, జూలై 5: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సంభవించిన భారీ పేలుడు ప్రమాదం పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిన సంగతి తెలిసిందే. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రమాదం చర్చనీయాంశంగా మారింది. క్షతగాత్రులు, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు పలు పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులు వస్తున్నారు. జూన్ 30న ప్రమాదం సంభవించిన రోజు సిగాచి పరిశ్రమకు మంత్రులు, ప్రతిపక్ష పార్టీలు, పలు రంగాల నిపుణులు, కలెక్టర్, ఎస్పీ తదితరులు తరలివచ్చారు.
రెండో రోజు సీఎం రేవంత్‌రెడ్డి , కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరిశ్రమకు వచ్చారు. అనంతరం పలు ప్రతిపక్ష పార్టీల కీలకనేతలు తరలి వస్తున్నారు. శుక్రవారం రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడిన ప్రత్యేక బృందం పర్యటించింది. శనివారం బీహారుకు చెందిన ఎంపీతో కూడిన బృందం సిగాచికి వచ్చింది. రోజు వీఐపీలు వస్తుండడంతో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అసలు విషయాన్ని దాచేందుకు పరిశ్రమల కాలుష్యంపై తాత్కాలిక చర్యలు తీసుకుంది.
2025 సంవత్సరం మొత్తంలో కాలుష్యం యావరేజ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ( ఏక్యూఐ) 108 ఉంది. ఏక్యూఐ 100 దాటితే పూర్ (బాగాలేదు)అని అర్థం. జూలై నెలలో శనివారం ఏక్యూఐ 44గా చూపిస్తున్నది. 50లోపు ఏక్యూఐ ఉంటే గుడ్ (బాగుందని) అర్థం. ఇంత అర్జంట్‌గా గాలి నాణ్యత మెరుగుపడడం అంటే ఏదో మ్యాజిక్ జరిగింది అనుకోవాలి. జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పరిశ్రమలకు ఇచ్చిన గట్టి వార్నింగ్ కారణంగానే పరిశ్రమలు తమ కాలుష్యాలను వదలడం లేదు. సీఎం, కేంద్ర మంత్రులు, సీఎస్, నిఫుణులు వస్తున్నారని, కాలుష్యం వాసనలు వస్తే మీ పైన చర్యలు ఉండవచ్చనే అధికారులు హెచ్చరిక చేయడంతోనే పరిశ్రమలు కాలుష్యం వెదజల్లకుండా ఇన్సినిరేటర్లు, స్క్రబ్బర్లు, చిమ్నిలు (కాలుష్యం శుద్ధి చేసే యంత్రాలు) వాడుతున్నారు.
దీని ద్వారా కాలుష్యం ఫిల్టర్ అవుతున్నది. నిబంధనల మేరకు 100 మీటర్లపైన గాలిని వదులుతున్నారు. జనవరి నుంచి జూన్ వరకు ఏక్యూఐ 108తో నాసిరకం గాలి ఉన్న చోట ఒక్కరోజులోనే గాలి నాణ్యమైనదిగా మారడంతో ప్రజలు తాజా గాలిని పీలుస్తున్నారు. పీసీబీ అధికారులు ఇదే తీరున పరిశ్రమలను నియంత్రిస్తే పాశమైలారం పారిశ్రామికవాడతో పాటు ఇస్నాపూర్, పాశమైలారం గ్రామం, క్యాసారం గ్రామం, రుద్రారం, ముత్తంగి, చిట్కుల్ గ్రామాల ప్రజలు నాణ్యమైన, శుద్ధమైన గాలిని పీలుస్తారు. ఈ సందడి తగ్గగానే పరిశ్రమలు మళ్లీ ప్రమాదకర స్థాయిలో విషవాయువులను వదులుతాయనడంలో సందేహం లేదని ప్రజలు భావిస్తున్నారు.