మెదక్ మున్సిపాలిటీ, మార్చి 13 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి నూతన విద్యావిధానంలో భాగంగా ఏఎక్స్ఎల్, ఈకే స్టెప్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో మొదటి దశలో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైన 6 జిల్లాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన ప్రారంభించిందని, మెరుగైన ఫలితాలు వచ్చినందున ఈనెల 15 నుంచి అన్ని జిల్లాల్లో ఏఐ ద్వారా బోధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, విద్యాశాఖ కమిషనర్ నర్సింహారెడ్డి తెలిపారు.
గురువారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, క్వాలిటీ అధికారులుతో వారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ప్రతి జిల్లా నుంచి ఒక క్వాలిటీ కంట్రోల్ అధికారి, మండల విద్యాధికారి, పాఠశాల సముదాయ హెచ్ఎంలు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడికి ప్రతి జిల్లా నుంచి నలుగురికి రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కృతిమ మేధ సాయంతో ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానంగా 3, 4, 5వ తరగతుల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి కృషిచేస్తున్నట్లు చెప్పారు.వీసీలో కలెక్టర్ రాహుల్‌రాజ్, డీఈవో రాధాకిషన్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తి, అధికారులు పాల్గొన్నారు.