మర్కూక్, డిసెంబర్ 11 : అన్నం పెట్టే రైతు యాచించే స్థితి నుంచి శాసించే స్థాయికి చేరాలన్న ఉద్దేశంతో స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు. వ్యవసాయ అభివృద్ధి కోసం రైతుబంధు సమితులను ఏర్పాటు చేశారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌గా నిర్ణయించి, వ్యవసాయ విస్తరణ అధికారులను నిర్మించారు. ప్రతీ క్లస్టర్‌కు రైతు వేదిక ఏర్పాటు చేశారు. భౌగోళికంగా మర్కూక్ మండలం భిన్న పంటల సాగుకు అనుకూలం.
కొండపోచమ్మ సాగర్ జలాశయం మండలంలో ఉండడంతో భూగర్భజలాలు పెరగడం, ఏడాది పొడవునా చెరువు, కుంటల్లో నీరు ఉండడంతో పలు పంటల సాగుకు అనుకూలంగా మారింది. అందులో భాగంగా రైతు వేదికల ద్వారా వరికి బదులు పత్తి, ఆయిల్‌పామ్, వేరుశనగ, కూరగాయలు, పండ్ల తోటలు, మల్బరి సాగు పంట లాభసాటి.. ఇలా వైవిధ్య సాగు వైపు రైతులను అధికారులు ప్రోత్సహిస్తున్నారు. రైతు వేదికల ద్వారా మండలం వ్యవసాయ అధికారి ప్రభుత్వ పథకాలపై ఎప్పటికప్పుడూ అవగాహన కల్పిస్తున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు.
విత్తనోత్పత్తి దిశగా అడుగులు
తెలంగాణ విత్తనోత్పత్తి అభివృద్ధి సంస్థ ద్వారా వరి, వేరుశనగ, శనగ, కంది, వంటి పంటల విత్తనోత్పత్తి సాగులో పాటించాల్సిన మెలకులలు రైతు వేదికలో సమావేశం ఏర్పాటు చేసి దాదాపు ఏడు వందల ఎకరాల్లో విత్తనోత్పత్తి చేసి మార్కెట్ ధర కంటే 15 శాతం నుంచి 20 శాతం అదనపు ఆదాయం పొందుతున్నారు.
జీలుగ సాగు..
ఎర్రవల్లి, మర్కూక్ రైతు వేదికలో పంట కాలనానికి ముందుస్తుగా జీలుగ, జనుము సాగుపై అవగాహన నిర్వహించడంతో దాదాపు 1300 ఎకరాల్లో పచ్చిరొట్ట ఎరువులను రైతులు వేసుకున్నారు. జీలుగ విత్తనాలను రైతులకు అధికారులు రైతు వేదికల ద్వారా పంపిణీ చేస్తున్నారు. దీంతో పంట దిగుబడులు పెరుగుతున్నాయి.
వేదసాగుతో విజయాలు
రోజురోజుకూ పెరుగుతున్న కూలీల కొరత అధిక ధరలతో వరి సాగు లాభదాయకంగా లేదు. ఈ సమస్యలకు సరైన పరిష్కారమే వరి వేద సాగు అని రైతులకు వ్యవసాయ అధికారులు రైతు వేదికల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. తర్వాత క్షేత్రస్థాయిలో ప్రదర్శనలు నిర్వహించడంతో మండలంలోని దాదాపు 450ఎకరాల్లో వెద సాగు చేసి రైతులు ఎకరానికి 7 నుంచి 8 వేల అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.
ఆయిల్‌పామ్‌లో ముందంజ..
ఆయిల్ ఫెడ్ సంస్థ ఉద్యాన అధికారుల సహకారంతో రైతులకు అవగాహన కలిగించి దాదాపు మండలంలో 700 ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలను అధికారులు నాటించారు. ఈ పంటల గురించి తయారు చేసిన ఫొటో వీడియోలను రైతు వేదికల్లో ప్రదర్శన నిర్వహించడంతో రైతులకు మంచి అవగాహన వచ్చింది.
అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు
మన రాష్ట్రంలో పండించే పత్తి నాణ్యతలో మెరుగు ఉండడంతో మంచి గిరాకీ ఉంది. ఇందులో భాగంగా రైతులు అధిక తదిగుబడులు సాధించే విలుగా పత్తి సాగులో నూతన పద్ధతి అయినా అధిక సాంద్రత పత్తి మండలంలోని 240 ఎకరాల్లో సాగు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇవే కాకుండా స్వీట్ కార్న్, గెర్కిక్ వంటి పంటలను ప్రైవేటు కంపెనీలతో బైబ్యాక్ పద్ధతిలో రైతులతో అగ్రిమెంట్ చేసుకొని, మంచి లాభాలు పొందేలా చేశారు. విత్తనాల ఎంపిక నుంచి సస్యరక్షణ చర్యలు మార్కెట్ వంటి అన్ని సందేహాలను రైతు వేదికలో వచ్చి నివృత్తి చేసుకుంటున్నారు.
రైతులకు ఉపయోగకరం..
రైతు వేదికల ద్వారా రైతులకు కావాల్సిన వ్యవసాయ సమాచారం అందుబాటు ఉంటుంది. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారు. రైతులు పంటలపై అవగాహన పెంచుకొని, సాగు చేసుకుంటే అధిక లాభాలు వస్తాయి. రైతు వేదికల్లో వ్యవసాయ సమాచారం ఎప్పటికప్పుడు అధికారులు తెలియజేయడంతో ఎంతో మేలు.
– చంద్రశేఖర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్, మర్కూక్