శివ్వంపేట : శివ్వంపేట మండలం గుండ్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత రెండు సంవత్సరాలుగా మిషన్ భగీరథ నీరు రాక కాలనీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం ఉదయం కాలనీ ప్రజలు, మహిళలు గ్రామంలో ఖాళీ బిందెలు, డ్రమ్ములు పెట్టి ప్రభుత్వానికి, అధికారుల తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు మాట్లాడుతూ.. తమ కాలనీకి వచ్చే మిషన్ భగీరథ పైపులైన్ చెడిపోయి నీళ్లు రాక రెండేళ్లు అవుతుందన్నారు.
సంవత్సరాలుగా తమకు నల్లాల నీళ్లు రాక పడరాని పాట్లు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఎస్సీ వాడపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. తమ సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టు తిరిగి తమ చెప్పులు అరిగిపోయాయని, సమస్య మాత్రం పరిష్కారం కాలేదని ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శి మూడు రోజులకోసారి ట్యాంకర్ ద్వారా నీళ్లు పంపుతున్నారని, కేవలం ఒక ఇంటికి రెండు డ్రమ్ములు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. రెండు డ్రమ్ములతో మూడు రోజులు ఎలా గడుపాలని ప్రశ్నిస్తున్నారు.
నీరు సరిపోక పంటపొలాల వద్ద బోర్ల నుంచి తెచ్చుకుందామంటే తమ పంటలకే నీరు సరిపోవడం లేదంటూ రైతులు నీళ్లు ఇవ్వడం లేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో కలెక్టర్ కార్యాలయానికి ఖాళీ బిందెలతో వెళ్లి ధర్నా చేస్తామని హెచ్చరించారు.