సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 20: నీటి సంరక్షణ మీదనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, సమస్త జీవుల మనుగడకు నీరు ఎంతో ముఖ్యం అని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నీటి సంరక్షణ కార్యక్రమంలో భాగంగా వాటర్ హెడ్ ఎన్జీవోల ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలో ఎంపిక చేసిన 10 గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవో, ఎంపీడీవోలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ప్రారంభ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నీటి సంరక్షణ, వర్షపు నీరు నిలువ, పొదుపుగా వినియోగించడం, ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
మన ఊరిలో, మన ఇంట్లో కురిసిన వర్షపు నీటిని భూమిలోకి ఇంచేలా చేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని సూచించారు. వర్షం మాటున వ్యర్థాలను చెరువులు, కుంటలు, వాగుల్లోకి వదిలి నీటిని కలుషితం చేస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ, మున్సిపల్ సిబ్బందికి అదనపు కలెక్టర్ ఆదేశించారు. విద్యా సంస్థలు, వసతి గృహాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నీటి వసతి కల్పించడం, నీటి వృథాను అరికట్టడం, నీటిని పొదుపుగా వాడుకునేలా చూడడం, భూగర్భ జలాల పెంపుకోసం చర్యలు తీసుకోవడంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీఆర్డీవో బాలరాజు, భూగర్భ జల అధికారి డాక్టర్ జి.మోహన్, డిప్యూటీ డైరెక్టర్, డీపీవో సాయిబాబా, వాటర్ హెడ్ జిల్లా ఇన్చార్జి శ్రీనివాస రావు, ఎంపీడీవోలు, ఏపీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.