సంగారెడ్డి, జూలై 15: సిగాచి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి 45మంది కార్మికులు మరణించారని, బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించి ఏవోకు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగి 15 రోజులు దాటినా పరిశ్రమ యాజమాన్యంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లు, పరిశ్రమల యాజమాన్యాలకు తొత్తులుగా పనిచేస్తూ కార్మికుల ఉసురు తీసుకుంటున్నాయని విమర్శించారు.
ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారుల అవినీతి కారణంగా పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగి కార్మికుల ప్రాణాలు పోతున్నట్లు ఆరోపించారు. కార్మికుల భద్రతపై నిర్లక్ష్యం వహిస్తున్న పరిశ్రమల యాజమాన్యాలపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు, రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు పాండురంగారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి, నాయకులు సురేశ్, సందీప్, కార్మికులు పాల్గొన్నారు.