పటాన్చెరు రూరల్, నవంబర్ 22: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన అగ్నిప్రమాదంలో 54 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం పరిశ్రమ యాజమాన్యమేనని చెబుతూ దాని తాలూకు పత్రాలను నవభారత్ నిర్మాణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ శనివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు అందజేశారు. హైదరాబాద్‌లోని హరీశ్‌రావు కార్యాలయంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ సమక్షంలో మెట్టు శ్రీధర్ కలిశారు.
తాను అధికారికంగా పొందిన సిగాచి పరిశ్రమ భద్రత, యాజమాన్యం నిర్లక్ష్యం, ఏడేండ్లుగా పరిశ్రమకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను మెట్టు శ్రీధర్ హరీశ్‌రావుకు అందజేశారు. సిగాచి పరిశ్రమపై నిజాయితీగా పోరాటం చేస్తున్న హరీశ్‌రావుపై తనకున్న నమ్మకం కారణంగా, అన్ని పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మెట్టు శ్రీధర్‌ను హరీశ్‌రావు అభినందించారు. సిగాచి పరిశ్రమపై జరుగుతున్న పోరాటానికి స్వచ్ఛందంగా వివిధ సంఘాలు కదలిరావడాన్ని ఆయన స్వాగతించారు.