సిద్దిపేట అర్బన్, ఆగస్టు 13: సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ బాలు ర వసతి గృహంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా జరిపిన తనిఖీల్లో పలు విషయాలు వెలుగుచూశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వసతి గృహంలోని ఏసీబీ అధికారులు పలు రికార్డులను తనిఖీ చేయగా, హాస్టల్ నిర్వాహకులు 12 రకాల రిజిస్టర్లు మెయింటెన్ చేయడం లేదని, హాస్టల్కు హాజరు కాని విద్యార్థుల రిజిస్టర్ పట్టికలో గైర్హాజరు అని వేయకుండా ‘డాట్’ లు పెట్టడాన్ని గుర్తించారు.
జూన్, జూలై నెలల్లో అబ్ స్ట్రాక్ట్ వేయలేదని గుర్తించారు. ఈ విషయాలను మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మీడియాకు వెల్లడించారు. తమతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు, తూనికలు కొలతల అధికారులు, శానిటరీ అధికారులు, ఆడిట్ అధికారులు తనిఖీల్లో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. తనిఖీల నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. తనిఖీల్లో డీఎస్పీ, ఇద్దరు ఏసీబీ సీఐలు రమేశ్, వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.