రామాయంపేట, జూలై 7: నిరుపేద గిరిజన మహిళారైతు కుటుంబానికి భూమి లేదు. వ్యవసాయం చేయడంలో మాత్రం అందరికీ ఆదర్శం. రామాయంపేట మండలం కోనాపూర్ గిరిజనతండాకు చెందిన మాలోత్ లత తండాలోనే ఓ గిరిజన రైతుకు చెందిన భూమిని కౌలుకు తీసుకుని కూరగాయల పంటలను పండిస్తుంది. 8గుంటల భూమిని కౌలుకు తీసుకుని అందులో పదిరకాల కూరగాయలను పండిస్తుంది. కౌలుకు తీసుకున్న భూమిలోనే టమాటా, కొత్తిమీర, పుదీనా, పాలకూర, బెండ, ఉల్లి, వంకాయ, పెద్ద చిక్కుడు, బీర, కాకరకాయ తదితర పంటలను పండిస్తుంది. వ్యవసాయశాఖ అధికారులు కూడా ఆ మహిళా రైతుకు పంటలపై పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
ప్రస్తుతం టమాట, కొత్తిమీర పంటలు చేతికి వచ్చాయి. 8గుంటల భూమిలో పది రకాల పంటలు వేయడంతో చుట్టుపక్కల రైతులు పంటల వివరాలు తెలుసుకుని ఆ మహిళారైతు నడుస్తున్న బాటలోనే నడుస్తూ అంతర పంటలు వేసుకుంటున్నారు. 100రోజుల్లోనే పంట చేతికిరావడంతో వాటిని రోజువారీగా గంపల్లో తీసుకుని రామాయంపేట, నార్సింగి, భిక్కనూరు, నిజాంపేట మండల కేంద్రాల్లోని అంగళ్లలో విక్రయాలు జరుపుతోంది. 100 రోజుల్లో పండే పంటకు రూ.పదివేలు పెట్టుబడి పెడుతూ రూ. లక్ష వరకు లాభాలు గడిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. తన కుటుంబాన్ని నడిపిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది.
కూరగాయల సాగుతో లాభాలు
సీఎం కేసీఆర్ సార్ చెప్పినట్లుగా కూరగాయల సాగుతో అధిక లాభాలు పొందవచ్చు. నేను కౌలుకు తీసుకున్న 8గుంటల భూమిలో పది రకాల కూరగాయలను పండిస్తున్న. ఒక పంట చేతికి రాగానే వాటిని విక్రయిస్తూ మరొక పంటను విత్తుకుంటున్న. ఇలా రెండేండ్లుగా కౌలు భూమిలో పంటలు పండిస్తూ లాభాలు పొందుతున్న. కూరగాయల పంటకు ఖర్చు తక్కువ లాభాలు ఎక్కువగా వస్తాయి. మూడు నెలల్లోనే కూరగాయల పండిస్తూ రూ.లక్ష వరకు సంపాదిస్తున్న. తనకు స్పూర్తి సీఎం కేసీఆరే సారే… ఆయన చెప్పినట్లే నడుస్తూ సాగు చేస్తున్న.
– మాలోత్ లత, మహిళా కౌలురైతు
అంతరపంటలపై అవగాహన కల్పిస్తున్నాం
రామాయంపేట మండలం కోనాపూర్ క్లస్టర్వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని పొలాల వద్దకు వెళ్లి అంతరపంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతులు కూడా వ్యవసాయఅధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ అంతరపంటలను సాగు చేస్తున్నారు. ఇప్పటివరకు క్లస్టర్ పరిధిలోని 30 ఎకరాల వరకు కూరగాయలు, టమాటా, ఉల్లి, మెంతి, కొత్తిమీర, పాలకూర తదితర పంటలను రైతులు విత్తుకుంటున్నారు.
– రాజ్నారాయణ, వ్యవసాయశాఖ అధికారి, రామాయంపేట