దుండిగల్, జనవరి 28: కారు అదుపు తప్పి బోల్తాపడడంతో ఓ విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన జానకీరామ్ అలియాస్ మణి, ధనుష్, సిద్దిపేట పట్టణానికి చెందిన నాయిని కల్యాణ్‌రెడ్డి (21) స్నేహితులు. జానకీరామ్, కల్యాణ్‌రెడ్డి మేడ్చల్‌లోని సీఎంఆర్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి కొంపల్లిలో ఓ వసతి గృహంలో ఉంటున్నారు. ధనుష్ దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతూ కొంపల్లిలోని మరో హాస్టల్లో ఉంటున్నాడు. జానకీరామ్, ధనుష్ టెన్త్ క్లాస్‌మెట్స్. ఖమ్మంకు చెందిన శివసాయి, చందు అనే ఇద్దరు స్నేహితులు శనివారం కొంపల్లిలోని తమ స్నేహితుల వద్దకు వచ్చారు. జానకీరామ్‌కు చెందిన ప్లాట్ బాచుపల్లిలో ఉంది.
అతడు మిత్రులతో (ఐదుగురు) కలిసి తన కారులో శనివారం కొంపల్లి నుంచి బాచుపల్లికి చేరుకున్నారు. రాత్రి 12 గంటల వరకు పార్టీ చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి అదే కారులో తిరుగు ప్రయాణమయ్యారు. కారు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ బౌరంపేట్ నుంచి బహదూర్‌పల్లి వెళ్లే మార్గంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారు వెనుక సీట్లో కూర్చున్న సిద్దిపేటకు చెందిన కల్యాణ్‌రెడ్డి తలకు బలమైన గాయలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హైదరాబాద్‌లోని గాంధీ వైద్యశాలకు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు నడిపిన జానకీరామ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్వల్పంగా గాయపడిన ధనుష్, శివసాయి, చందు దవాఖానలో చికిత్స పొందుతున్నారు.