సిద్దిపేట, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాకు మొండిచేయి చూపింది. ఏడాదిలో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల అభివృద్ధికి నిధులు విడుదల చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులు రద్దు చేయడంతోపాటు నిర్మాణంలో ఉన్న పనులను మధ్యలో ఆపేసింది. ఉమ్మడి జిల్లాపై కాం గ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి నిధుల రాకుండా చేయడంతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వివక్ష చూపుతూ వారి నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేయడం లేదు. సంక్షేమ పథకాల్లోనూ వివక్ష కనబరుస్తుంది. కల్యాణలక్ష్మి చెక్కులను ఆపేసింది. చివరికి కోర్టు మెట్లు ఎక్కి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు చెక్కులు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో పలు అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. సంగారెడ్డి జిల్లాలోని సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు నిలిచిపోయాయి. సాగు నీటి కష్టాలు తీరుతాయనుకున్న రైతుల ఆశలు ఆవిరి అయ్యాయి. ఇలా ఎన్నో అభివృద్ధి పనులకు బ్రేక్‌లు పడ్డాయి. మచ్చుకు ఒక్క సిద్దిపేట నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసిన రూ.875.92 కోట్ల పనులను ప్రభుత్వం ఆపేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిన వాటిలో కొన్నింటిని చూస్తే…శిల్పారామం రూ.23 కోట్లు, నెక్లెస్ రోడ్డు రూ.15 కోట్లు, వెటర్నరీ కళాశాల రూ.300కోట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రూ.25 కోట్లు, రంగనాయక సాగర్ టూరిజం పనులు రూ.100 కోట్లు, వెయ్యి పడకల దవాఖానలో వివిధ సేవలకు రూ.27 కోట్లు, మహాతి ఆడిటోరియం రూ.50 కోట్ల పనులు ఆగిపోయాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధికి నిధు లు మంజూరు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడుతోంది.
అభివృద్ధిని పట్టించుకోని మంత్రులు
ఉమ్మడి జిల్లా అభివృద్ధి, సంక్షేమాన్ని జిల్లా మంత్రులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు బలంగా ఉన్నాయి. వారి సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు తప్ప ఇతర నియోజకవర్గాల అభివృద్ధి మీద దృష్టి పెట్ట డం లేదు. ఏడాది కాలంగా జిల్లాకు నిధులు ఏం రాలే దు. దీంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగా జిల్లాల అభివృద్ధి తయారైంది. ఏడాది కాలంలో అసలు ప్రభుత్వం ఉందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిస్థాయిలో జిల్లాల అభివృద్ధిపై సమీక్ష జరిగిన సందర్భాలు లేవు. ఏడాది కాలంలో ఒకే ఒక్కసారి ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్జి నేతృత్వంలో సమీక్షా జరిగింది తప్ప మరోటి లేదు.
అది కూడా జరిగిందా..? అంటే జరిగింది అన్నట్లుగా చేశారు. ఆ సమీక్షతో జిల్లాకు ఉపయోగ పడింది ఏం లేదు. జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటి ని మంత్రులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లాల్లో తాగునీరు, సాగునీరు, రైతుబంధు, ఇంటర్, పది పరీక్షలు, కరెంట్ ఇలా ఎన్నో అంశాలపై రివ్యూ మీటింగ్‌లు నిర్వహించి అధికారులకు దిశానిద్దేశం చేయాల్సిన మంత్రులు మొఖం చాటేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులకు మంజూరు చేసిన నిధు లు వెనక్కిపోవడంతో పనులు మధ్యలో ఆగిపోయా యి..వాటి పరిస్థితి ఏంటి..? ఇవన్నీంటిని ఎలా పరిష్కరించాలి..? కనీసం జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రులు సూచనలు కూడా ఇవ్వడం లేదు. అసలు ప్రభుత్వం ఉందా ..? పాలన నడుస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి.
జిల్లాల సమస్యలపై దృష్టి సారించాలి
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎం తైన ఉంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఏం ప్రయోజనం లేదు. ఈ నూతన సంవత్సరంలోనైనా అభివృద్ధికి నిధులు వస్తాయా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ, రైతు భరోసా కోసం జిల్లా రైతాం గం ఎదురు చూస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో రైతుబంధు అందించి ఆదుకుంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు ప్రారంభించినప్పటి నుంచి గత వానకాలం వరకు (11 విడతల్లో) సిద్దిపేట జిల్లాలో 29,33,494 మంది రైతులకు రూ.3,124. 82 కోట్లు, మెదక్ జిల్లాలో24,69,637 రైతులకు రూ.2,027.37 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 31,95, 960 మంది రైతులకు రూ.3,619.54 కోట్లు, మొత్తం ఉమ్మడి జిల్లాలో 85,99,091 మంది రైతులకు రూ. 8,771.73 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో కేసీఆర్ ప్రభుత్వం జమ చేసి రైతులకు దన్నుగా నిలిచింది.
ఈ ప్రభుత్వం ఇంతవరకు రైతుబంధు విడుదల చేయడం లేదు. ఫలితంగా రైతులు ప్రైవేట్ వ్యక్తుల వద్ద వడ్డీలకు తెచ్చి సాగు చేసుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తుంది. కరెంట్ అప్పడే చుక్కలు చూపిస్తుంది. కాల్వల ద్వారా కాళేశ్వరం జలా లు విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికి ఆ దిశగా కార్యాచరణ చేయడం లేదు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు మొదలవుతున్నాయి. వీటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పది, ఇంటర్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. విద్యాశాఖ సైతం పూర్తి నిర్లిప్తంగా ఉంది.గ్రామాల్లో గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతుంది. గ్రామాల్లో ప్రత్యేకాధికారులు గ్రామాల సమస్యలపై దృష్టి సారించడం లేదు. ఇలా ఎన్నో సమస్యలు ఉమ్మడి జిల్లాను పట్టిపీడిస్తున్నాయి. ప్రధానంగా తాగు, సాగునీరు, కరెంట్ తదితర అంశాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నూతన సంవత్సరంలోనైనా సవ్యంగా ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.
పూడికతో నిండిపోయిన కాల్వలు
ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కింద కాల్వలు పూడికతో నిండిపోయాయి. ప్రాజెక్టుల ద్వారా పంట పొలాలకు సాగునీటిని తరలించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ముమ్మరంగా కాల్వల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాల్వలు పూడి క, పిచ్చి మొక్కలతో నిండిపోయి దర్శనం ఇస్తున్నా యి. సిద్దిపే ట జిల్లాలో అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్నసాగర్, కొండ పోచమ్మ రిజర్వాయర్లతోపాటు సిం గూరు, వనదుర్గ ప్రాజెక్టులు ఉన్నాయి. శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు, తపాస్‌పల్లి ప్రాజెక్టులు ఉమ్మడి జిల్లా లో ప్రధానంగా ఉన్నాయి. నాలుగైదు సంవత్సరాల నుంచి గోదావరి జలాల ను ఎత్తి పోసి జిల్లా రైతాంగానికి సాగునీటిని కేసీఆర్ ప్రభుత్వం అందించింది. ప్రస్తుత యాసంగికి సాగునీటిని విడుదల చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. సిద్దిపే ట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాల చెరువులను గోదావరి జలాలతో నింపుతున్నారు. భారీ, మధ్యతరహా, చిన్న కాల్వలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి ప్రతి చెరువుకు నీళ్లు పోయేలా చేసింది. కాల్వ ల నిర్వహణను చూసుకోవాల్సిన అధికారులు వాటిని గాలికి వదిలివేశారు. యాసంగికి సాగునీరు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు.