చేర్యాల, జనవరి 30: సిద్దిపేట జిల్లా చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకుంటే ఊరుకునేది లేదని, ప్రజల మనోభావాలను గుర్తించి ప్రభుత్వం వెంటనే డివిజన్ ప్రకటించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. చేర్యాలలో గురువారం రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ వకులాభరణం నర్సయ్యపంతులు ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా, ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ సందర్భంగా మహాధర్నాలో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రెవెన్యూ డివిజన్ ఏర్పాటును వెంటనే ప్రకటించకపోతే కాంగ్రెస్ నాయకుల ఇండ్లను ముట్టడిస్తామని, ఎక్కడిక్కడ నిలదీస్తామని హెచ్చరించారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశాన్ని సభ దృష్టికి తీసుకువచ్చానని, సీఎంతో పాటు మంత్రులకు వినతిపత్రాలు అందించినట్లు గుర్తుచేశారు. అన్ని పార్టీలు, వర్గాలు, ప్రజా సంఘాలు చేర్యాల రెవెన్యూ డివిజన్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఎందుకు జీవో జారీ చేయడం లేదని ప్రశ్నించారు. తనను చేర్యాల ప్రాంత ప్రజలు అక్కున చేర్చుకుని ఎమ్మెల్యేగా గెలిపించారని, ఈ ప్రాంత ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, అన్నివర్గాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించేందుకు ఓ వైపు అసెంబ్లీలో, మరోవైపు ప్రజా పోరాటాల్లో పాల్గొంటానని తెలిపారు.
కాంగ్రెస్ ఇన్చార్జిగా ఉన్న వ్యక్తి ఇంకా ఓటమిని జీర్ణించుకోలేక ఇష్టారాజ్యంగా చేయకూడని పనులు చేస్తున్నాడని, లేనిపోని పంచాయితీలు చేస్తూ ప్రజలను, పార్టీలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని విమర్శించారు. పోలీసులతో అధికారం చెలాయిస్తామని అనుకోవడం అవివేకమని, పోలీసులు ప్రజలు కోరుకుంటున్న న్యాయం వైపు ఉండాలన్నారు. చేర్యాలను డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తామని ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకోవాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ.. అధికార పార్టీ నాయకులు జేఏసీ ఏర్పాటు చేసుకుని రెవెన్యూ డివిజన్ కోసం పోరాటాలు చేస్తున్నారని, ఇది ఎక్కడా లేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ఇన్చార్జి చిత్తశుద్ధి ఉంటే నేరుగా సీఎం వద్దకు వెళ్లి డివిజన్ ఏర్పాటు జీవో తీసుకురావాలని సూచించారు. చేర్యాల డివిజన్ కోసం శాసన మండలిలో ప్రస్తావిస్తానని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కేవీఎల్‌ఎన్‌రెడ్డి మాట్లాడుతూ.. చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని, ఈ విషయమై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అంతకుముందు చేర్యాలలోని గాంధీ సెంటర్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు ముస్త్యాల బాల్‌నర్సయ్య, ఒగ్గు రాజు, బూరుగు సురేశ్‌గౌడ్, భూమిగారి రాజేందర్, నాయకులు పాల్గొన్నారు.