న్యాల్కల్, ఆక్టోబర్ 9: వచ్చే శాసనసభ ఎన్నికలకు ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా మద్యం, డబ్బు ఇతర విలువైన వస్తువులు, సామగ్రి అక్రమంగా తరలించకుండా న్యాల్కల్ మండలంలోని హుస్సేలి, మల్గి గ్రామ శివారులోని తెలంగాణ-కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో పోలీసు చెక్‌పోస్టును సోమవారం ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జహీరాబాద్ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో జహీరాబాద్ రూరల్ సీఐ నోముల వెంకటేశ్, హద్నూర్ ఎస్సై రామానాయుడు పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. జహీరాబాద్-బీదర్ ప్రధాన రోడ్డుతో పాటు మల్గి గ్రామ శివారు నుంచి చీకూర్తి, చాల్కి మీదుగా నారాయణఖేడ్ తదితర ప్రాంతాలకు వెళ్లే మార్గాల ద్వారా తెలంగాణలోకి వస్తున్న వాహనాలను చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా జహీరాబాద్ రూరల్ సీఐ నోముల వెంకటేశ్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మండలంలోని హుస్సేల్లి, మల్గి గ్రామ శివారులోని తెలంగాణ – కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. చెక్‌పోస్టు వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారుల సమన్వయంతో నిరంతరం వాహనాల తనిఖీలు చేస్తారన్నారు. డబ్బు, మద్యం అక్రమ రవాణా జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. జహీరాబాద్ రూరల్ సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బంది షిప్టుల వారీగా విధులు నిర్వహిస్తారన్నారు. చెక్‌పోస్టు వద్ద విధుల్లో ఉండే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.