హుస్నాబాద్, మే 31: హుస్నాబాద్ పట్టణ ప్రజలకు తాగునీరందించడంతో పాటు ఆయకట్టు రైతులకు చెందిన వ్యవసాయ బావులు, పశుపక్షాదులకు ఆదరువు అయిన హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువు నీళ్లజోలికొస్తే ఖబడ్ద్దార్ అని రైతులు, అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. ఎల్లమ్మ చెరువులో చేపల కాంట్రాక్టర్ అనుమతులు లేకుండా గండికొట్టి, తూమును తెరిచి నీళ్లను వృథాగా బయటకు పంపడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అఖిలపక్ష నాయకులు, ఆయకట్టు రైతులు చెరువు కట్ట తూము వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. చేపల కోసం చెరువు నీళ్లను అక్రమంగా బయటకు పంపిన కాంట్రాక్టర్‌పై క్రిమినల్‌చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని ముదిరాజ్ కులస్తులను రెచ్చగొట్టి రైతులు, ముదిరాజ్‌ల మధ్య చిచ్చుపెట్టేందుకు కాంట్రాక్టర్ కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. తూమును తెరవాలంటే నీటి పారుదల శాఖ అధికారుల అనుమతితో తెరవాల్సి ఉంటుందని, కాంట్రాక్టర్ రాత్రికి రాత్రే తనవద్ద ఉన్న సామగ్రితో తూమును తెరవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
నీటి పారుదల శాఖ అధికారులతో కుమ్మక్కై సదరు కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేపలు పట్టుకునేందుకు తాము వ్యతిరేకం కాదని, నీళ్లను వృథా చేసి చేపలు పట్టుకోవడమేంటని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ నిర్వాకం వల్ల చెరువునీళ్లు సగం వరకు బయటకు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైనవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, బీఆర్ఎస్ నాయకులు వెంకట్, అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, సుధాకర్, కాంగ్రెస్ నాయకులు రాజు, రాములు, బీజేపీ నాయకులు శ్రీనివాస్, శంకర్‌బాబు, అనంతస్వామి, రాంప్రసాద్, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ రవీందర్‌గౌడ్, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.