దుబ్బాక, ఆగస్టు 27: నవ మాసాలు మోసి, కంటికి రెప్పలా కాపాడి పెద్ద చేసిన కొడుకుకు కన్నతల్లి భారమైంది. వృద్ధాప్యంలో తల్లికి అండగా నిలవాల్సిన కొడుకు తనకు సంబంధమే లేదంటూ అమానవీయంగా వ్యవహరించాడు. దీంతో పదేండ్లుగా గుడిసెలో ఒంటరిగా ఉంటూ భిక్షాటన చేసి కాలం వెల్లదీసింది. కొద్దిరోజుల క్రితం కాళ్లు చచ్చుబడిపోవడంతో నడవలేని ఆ వృద్ధురాలి ధీనస్థితిపై స్థానికులు చలించి కాలనీలో ఉన్న ఖాళీ స్థలంలో గుడిసె ఏర్పాటు వేసి గూడు కల్పించారు. రోజుకొకరు పెట్టిన అన్నం తింటూ బతికీడుస్తున్నది. ఈ క్రమం లో సోమవారం అర్ధరాత్రి వీధికుక్కలు వృద్ధురాలి గుడిసెలోని చొచ్చుకొచ్చి ఆమెపై తీవ్రంగా దాడి చేశాయి.
ఈ ఘటనలో ఒళ్ల్లంతా తీవ్ర గాయాలతో ఆచేతన స్థితిలోకి చేరిన వృద్ధురాలిని చూసి కాలనీవాసులు చలించిపోయారు. ఈ విషయాన్ని వృద్ధురాలు కొడుకుకు కాలనీవాసులు తెలిపినా పట్టించుకోలేదు. అలాంటి కసాయి కొడుకు లోకంలో ఏ తల్లికి ఉండవద్దంటూ దుమ్మెత్తిపోశారు. చేసేదేమిలేక చివరకు కాలనీ వాసులు 108 అంబులెన్స్‌లో దుబ్బాక సర్కారు దవాఖానకు ఆమెను తరలించి వైద్యం అందించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని రేపల్లెవాడలో వృద్ధురాలు అయ్యగారి రంగవ్వ(90) కన్న కొడుకు ప్రేమకు నోచుకోలేక ఒంటరిగా జీవిస్తున్నది. ఆమెకు సత్యనారాయణ ఒక్కగానొక్క సంతానం.
అతడి విలాసాలకు ఉన్న ఐదెకరాల వ్యవసాయ భూమి, ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. వృద్ధాప్యంలో తల్లి సంరక్షణను మరిచాడు. కొడుకుకు భారంగా ఉండకూడదనుకుని ఆమె 20 ఏండ్లుగా దుబ్బాకలో భిక్షాటన చేసుకుని జీవించింది. ఆమెకు కాళ్లు చచ్చుబడడంతో పదేండ్లుగా రేపల్లెవాడలో ఆశ్రయం పొందుతున్నది.ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి వీధికుక్కల దాడిలో ఆమె తీవ్రంగా గాయపడగా, 108 అంబులెన్స్‌లో దుబ్బాక వంద పడకల దవాఖానకు తరలించి వైద్యం అందించారు. పోలీసుల సూచనతో కొడుకు సత్యనారాయణ, మనువడు మోహన్ దవాఖానకు వచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను సిద్దిపేట జిల్లా దవాఖానకు వైద్యు లు రిఫర్ చేశారు. వృద్ధురాలి ఆలనా పాలనా పట్టించుకోక పోవడంపై స్థానికులు కుమారుడిపై ఆగ్ర హం వ్యక్తం చేశారు.