1.57 టీఎంసీల సామర్థ్యం గల కోట్‌పల్లి ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్నా ఆయకట్టు రైతులు పూర్తిస్థాయిలో పంటలను సాగు చేసుకోలేని పరిస్థితి నెలకొన్నది. ఈ ప్రాజెక్టును 50 ఏండ్ల కిందట నిర్మించడంతో దాని కాల్వలు పూర్తిగా దెబ్బతినగా.. తూములు కొట్టుకుపోయాయి. గత కేసీఆర్ ప్రభుత్వం రైతులకు నష్టం జరగొద్దనే సదుద్దేశంతో ఈ ప్రాజెక్టు ఆధునీకరణకు చర్యలు చేపట్టింది. నిధులు విడుదల చేసే దశలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ అక్కడికే ఆగిపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను పట్టించుకోవడంలేదు. అంచనాలకే పరిమితమై రైతులకు అన్యాయం చేస్తున్నది.
వికారాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు అయిన కోట్‌పల్లిలో సమృద్ధిగా నీరున్నా రైతు లు తమ పంట పొలాల సాగుకు వినియోగించుకోలేని దుస్థితి నెలకొన్నది. గత మూడు, నాలుగేండ్లుగా వర్షాలు సమృద్ధిగా కురవడం తో కోట్‌పల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు మెండు గా ఉన్నాయి. ఈ ప్రాజెక్టును 50 ఏండ్ల కిం దట నిర్మించడంతో దాని కాల్వలు పూర్తిగా దెబ్బతినడం, తూములు కొట్టుకుపోవడం, బ్రిడ్జిలు కూలిపోవడంతో సమృద్ధిగా నీరున్నా ఆయకట్టుకు పూర్తిగా సాగు నీరందని పరిస్థితి నెలకొన్నది.
కాగా బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి బడ్జెట్లో ఈ ప్రాజెక్టును ఆధునీకరించాలని సంకల్పించగా.. అధికారులు అవసరమైన నిధుల కోసం అంచనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేశారు. నిధుల మంజూరు దశ లో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ అక్కడికే ఆగిపోయింది. తదనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునీకరణ అంశమే లేకపోవడం గమనార్హం.
ప్రజల ఒత్తిడితో అంచనాలను రూపొందించి సర్కారుకు పంపించామని స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నా ఇప్పటివరకు నిధులు మాత్రం మంజూరే కాలేదు. అంతేకాకుండా ప్రతిసారీ అంచనాలను మార్చి పంపించాలని తిప్పి పం పిస్తుండడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు ఇప్పటికే నాలుగుసార్లు అంచనాలను రూపొందిం చి ప్రభుత్వానికి అందజేసినా.. నిధుల మం జూరుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు.
తాజాగా మరోసారి అంచనాలను మార్చి పంపాలని ఆదేశించడంతో జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు మరమ్మతు పనులకు సంబంధించిన సర్వేలో బిజీగా ఉన్నారు. జిల్లా రైతులకు సాగునీరు అందించే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడంతోనే నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నదని పలువురు మండిపడుతున్నారు.
1.57 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్నా కాల్వలు కొట్టుకుపోవడం, దెబ్బతినడంతో రైతులకు నష్టం జరగొద్దనే ఉద్దేశంతో తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కోట్‌పల్లి ప్రాజెక్టును ఆధునీకరించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా .. స్పందించిన కేసీఆర్ వెంటనే జలవనరుల అధికారుల బృందాన్ని అక్కడికి పంపించి.. ఏయే పనులు చేపట్టాలో సమగ్ర నివేదికను అందజేయాలని సూచించారు.
అధికారుల సూ చనల మేరకు కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ.110 కోట్లతో ప్రాజెక్టు ఆధునీకరణతోపాటు ఆనకట్ట బలోపేతం, కుడి, ఎడమ, బేబీ కాల్వల పునర్నిర్మాణం, పాత వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు అంచనాలను తయారు చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో నిధులు విడుదలకు బ్రేక్ పడింది. తదనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నది. మరోవైపు తాండూరు, వికారాబాద్ ఎమ్మెల్యేలు ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు తీసు కు రావడం లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
కోట్‌పల్లి ప్రాజెక్టు ద్వారా తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లోని 18 గ్రామాలకు సా గునీరు అందించాల్సి ఉండగా.. కాల్వలు పూ ర్తిగా దెబ్బతినడం, తూములు కొట్టుకుపోవడం తో కేవలం 2-3 గ్రామాలకు మాత్రమే కొన్నేం డ్లుగా సాగునీరందుతున్నది. అయితే ఈ ప్రాజె క్టు ఎడమ కాల్వ ద్వారా రుద్రారం, గట్టేపల్లి గ్రా మాలకు.. కుడి కాల్వ ద్వారా ఒక్క గ్రామానికి కూడా సాగు నీరందడంలేదు. తూములు, కాల్వలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో ఈ యాసంగిలో సాగు నీరం దడం కష్టమేనని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా 9,200 ఎకరాలకు (కుడి కాల్వ ద్వారా 8,100 ఎకరాలు, ఎడమ, బేబీ కాల్వ ద్వారా 1100 ఎకరాలకు) సాగు నీరందించే సామర్థ్యం ఉన్నది. ఈ ప్రాజెక్టు ఆధునీకరణ పనులు పూర్తైతే 15 వేల ఎకరాలకుపైగా సాగు నీరందించే అవకాశాలున్నట్లు జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు కుడి కాల్వ కింద ధారూరు మండలంలోని నాగసముందర్, అల్లాపూర్, రుద్రా రం, బూర్గుగడ్డ, గట్టేపల్లి గ్రామాలుండగా, ఎడమ కాల్వ కింద పెద్దేముల్ మండలంలోని మాన్సాన్పల్లి, బుద్దారం, పెద్దేముల్, మారేపల్లి, దుగ్గాపూర్, రుక్మాపూర్, కొండాపూర్, ఖానాపూర్, రేగొండి, మదవంతాపూర్, జనగాం, మంబాపూర్, తింసాన్‌పల్లి గ్రామాలున్నాయి. బేబీ కాల్వ కింద నాగసముందర్, బూర్గుగడ్డ గ్రామాల ఆయకట్టుకు సాగునీరందించేలా నిర్మించారు.