గజ్వేల్ పట్టణానికి మణిహారంగా రింగురోడ్డు నిర్మాణమవుతున్నది. రూ.230కోట్ల అంచనా వ్యయంతో రింగురోడ్డు రూపుదిద్దుకుంటున్నది. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చుట్టూ 22కిలోమీటర్ల మేర రోడ్డు పనులు సాగుతున్నాయి. అంతే కాకుండా గజ్వేల్ పట్టణాన్ని రింగురోడ్డుతో అనుసంధానం చేస్తూ గజ్వేల్‌ను కలుపుతూ 13కిలోమీటర్ల రేడియల్ రోడ్ల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. గజ్వేల్ నుంచి ముట్రాజ్‌పల్లి, వర్గల్, తూప్రాన్, చేగుంట, దౌల్తాబాద్, పిడిచెడ్, రిమ్మనగూడ, జగదేవ్‌పూర్, పాతూర్ ప్రాంతాల్లో 9రింగురోడ్డు ప్రధాన కూడళ్లను అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే 70శాతం పనులను రూ.160కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. వచ్చే మార్చిలోగా రింగురోడ్డు పనులు పూర్తి కానున్నాయి. మంత్రి హరీశ్‌రావు, ఆర్అండ్బీ ఉన్నతాధికారులు ప్రతిరోజు రోడ్డు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు.
గజ్వేల్, డిసెంబర్ 16 : బృందావనం అన్న పదం వినగానే కృష్ణుడు నడయాడిన అందమైన వృక్షాలు.. పూలమొక్కలు.. అలంకరణ చెట్లు.. అద్దంలాంటి రహదారులతో కూడిన ఉద్యానవనం కండ్లలో మెదులుతుంది. అదేమాదిరిగా సీఎం కేసీఆర్ గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నారు. నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌కు మండలంలోని ఇతర గ్రామాలతో పాటు ఇతర మండలాల నుంచి ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా గజ్వేల్ పట్టణాన్ని కలుపుతూ గజ్వేల్ చుట్టూ రూ.230 కోట్ల వ్యయంతో అద్భుతంగా రింగురోడ్డు నిర్మాణమవుతున్నది. కరోనాతో రెండేండ్లు నిలిచిపోయిన పనులు గతేడాది పునఃప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ గజ్వేల్ అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సమావేశంలో గజ్వేల్ పట్టణానికి అవసరమైన అన్ని మౌలిక వసతులతో పాటు ప్రత్యేక హంగులను సమకూర్చడానికి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దానిలో భాగంగానే మిషన్ భగీరథ, గజ్వేల్ దవాఖాన, సమీకృత మార్కెట్, ఎడ్యుకేషన్ హబ్‌లు, మహతి ఆడిటోరియం, పాండవుల చెరువు మినీట్యాంక్‌బండ్, గజ్వేల్ రహదారుల విస్తరణ తదితర అభివృద్ధి పనులను చేయాలని నిర్ణయించారు. పట్టణ ప్రజల దాహం తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించిన మిషన్ భగీరథ పథకం యావత్ తెలంగాణ ప్రజలకు ఇంటింటికీ తాగునీరందిస్తున్నది. ఎడ్యుకేషన్ హబ్‌లు యూనివర్సిటీలకు దీటుగా తీర్చిదిద్దారు. మహతి ఆడిటోరియం తెలంగాణ భాషను, సంస్కృతిని, సాహిత్యాన్ని ప్రజలందరికీ పరిచయం చేసే వేదికలా మారింది. పాండవుల చెరువు, అర్బన్ పార్కు, హెర్బల్ పార్కులు ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఆరోగ్యాన్ని పంచుతున్నాయి. సమీకృత మార్కెట్‌తో ఆరోగ్యకర వాతావరణంలో వెజ్, నాన్ కూరగాయలు, పండ్లు, పువ్వులు అన్నీ ఒకేచోట ప్రజలకు దొరుకుతున్నాయి. సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయం (ఐవోసీ)తో ప్రభుత్వాధికారుల అన్నీ సేవలు ఒకేచోట పొందే అవకాశం ఏర్పడింది. వ్యాపారపరంగా మరింత అభివృద్ధి చెందడానికి రవాణమార్గం ఎంతో అనువుగా ఉండాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ గజ్వేల్ చుట్టూ రింగురోడ్డును నిర్మిస్తున్నారు.
రోడ్డు, రైలు మార్గాలతో వాణిజ్యపరంగా..
ఇప్పటికే గజ్వేల్ పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలో అధికసంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. రోడ్డు, రైలు మార్గాల అభివృద్ధితో మరిన్ని పరిశ్రమల స్థాపనకు దారులు పడ్డాయి. వర్గల్, ములుగు ప్రాం తాల్లో కొండపోచమ్మ ప్రాజెక్టు, మల్లన్నసాగర్ ప్రాజెక్టు పునరావాస ప్రజలకు ఉపాధి కల్పించడానికి ఫుడ్‌ప్రాసెసింగ్ కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. గజ్వేల్ రింగురోడ్డు నిర్మాణం, అలాగే రైల్వేస్టేషన్ ఏర్పాటుతో గజ్వేల్ పరిసరాల్లో మరిన్ని కంపెనీల ఏర్పాటుకు పలు సంస్థలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. రైల్వే సౌకర్యంతో గజ్వేల్‌లో ఇప్పటికే అవంతి కార్పొరేషన్ సంస్థ ఎరువుల గిడ్డంగులను ఏర్పాటు చేసి ఎరువుల క్రయవిక్రయాలు కొనసాగిస్తున్నది. భవిష్యత్‌లో సేవా, ఉత్పత్తి రంగ సం స్థలు మరిన్ని గజ్వేల్‌కు రానున్నాయి.
దేశానికి ఆదర్శంగా గజ్వేల్ రింగురోడ్డు
సకల వసతులు సమకూరి దేశానికి ఆదర్శంగా రూపుదిద్దుకున్న గజ్వేల్ పట్టణానికి మణిహారంగా రింగురోడ్డు నిర్మాణమవుతున్నది. రూ.230కోట్ల అంచనా వ్యయంతో అద్భుతంగా గజ్వేల్ రింగురోడ్డు నిర్మాణం కొనసాగుతున్నది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చుట్టూ 22కిలోమీటర్ల మేర రింగురోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గజ్వేల్ పట్టణాన్ని రింగురోడ్డుతో అనుసంధానం చేస్తూ గజ్వేల్‌ను కలుపుతూ 13కిలోమీటర్ల రేడియల్ రోడ్ల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. గజ్వేల్-ప్రజాపూర్ మున్సిపాలిటీ మండలంతో పాటు నియోజకవర్గ పరిధిలోని వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, మర్కూక్, ములుగు, తూప్రాన్, మనోహరాబాద్‌తో పాటు దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాలను కలుపుతూ రింగురోడ్డు నిర్మా ణం కొనసాగుతున్నది.
రింగురోడ్డులో భాగంగా గజ్వేల్ నుంచి ముట్రాజ్‌పల్లి, వర్గల్, తూప్రాన్, చేగుంట, దౌల్తాబాద్, పిడిచెడ్, రిమ్మనగూడ, జగదేవ్‌పూర్, పాతూర్ ప్రాంతాల్లో 9 రింగురోడ్డు ప్రధాన కూడళ్లను అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే తూప్రాన్, దౌల్తాబాద్ మార్గాల్లోని రింగురోడ్డు ప్రధాన కూడళ్లను వివిధ రకాల అలంకరణ మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు. వీటితో పాటు పూర్తయిన రేడియల్ రోడ్లలో హరితహారం ద్వారా డివైడర్లను అందంగా తీర్చిదిద్దారు. రింగురోడ్డులో నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 70శాతం పనులను రూ.160కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. వచ్చే మార్చిలోగా రింగురోడ్డు పనులు పూర్తి కానుండగా మంత్రి హరీశ్‌రావు, ఆర్అండ్బీ ఉన్నతాధికారులు ప్రతిరోజు రోడ్డు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు.రింగురోడ్డు నిర్మాణంలో మేజర్ బ్రిడ్జిలు (వెహికల్ అండర్‌పాస్) రిమ్మనగూడ, జగదేవ్‌పూర్, పాతూర్ ప్రాంతాల్లో నిర్మించగా, మైనర్ బ్రిడ్జిలు వివిధ ప్రాంతాల్లో మొత్తం 20 నిర్మించారు.
దేశానికి ఆదర్శంగా గజ్వేల్
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించడంతో గజ్వేల్ నియోజకవర్గం దేశానికి ఆదర్శంగా మారింది. దశాబ్దాలుగా వివిధ పార్టీలకు ప్రాతినిధ్యం వహించిన సమైక్యవాద పాలకుల చేతుల్లో వెనకబడ్డ గజ్వేల్ పట్టణాన్ని, నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ అద్భుతంగా మార్చారు. వందేండ్ల అభివృద్ధిని ఎనిమిదేండ్లలో చేశారు. విద్య, వైద్యం, తాగు, సాగునీరు, రవాణా, మౌలిక వసతులు.. ఇలా అన్ని అందుబాటులోకి తెచ్చారు. గతపాలకుల శీతకన్నుతో గజ్వేల్ ప్రజలు అరిగోస పడ్డారు. కానీ, సీఎం కేసీఆర్ ఒక్కసారి ప్రాతినిధ్యం వహించినప్పుడే ఈ సమస్యలన్నీ తీరిపోయి. ఆయా రంగాల్లో గజ్వేల్ దేశానికి ఆదర్శంగా మారిపోయింది. కరోనాతో ఆలస్యమైన రింగురోడ్డు పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయి. అటు రోడ్డు రవాణా, ఇటు రైలు రవాణా మార్గాలు రెండూ అందుబాటులోకి రావడంతో వ్యాపారపరంగా మరింతగా గజ్వేల్ అభివృద్ధి చెందనున్నది.
– వంటేరు ప్రతాప్‌రెడ్డి , ఎఫ్డీసీ చైర్మన్