సంగారెడ్డి, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 వరకు కొనసాగింది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన ఓటిం గ్ మధ్యాహ్నం తర్వాత ఊపందుకుంది. 11 మున్సిపాలిటీల్లో 76.01 శాతం పోలింగ్ నమోదైంది.సంగారెడ్డి, సదాశివపేట, కోహీర్, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్-జోగిపేట, ఇస్నాపూర్, ఇంద్రేశం, గడ్డపోతారం, జిన్నారం, గుమ్మడిదల 541 పోలింగ్ కేంద్రా ల్లో 2,59,821 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 11 మున్సిపాలిటీల్లో మొత్తం 3,41,808 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 2,59,821 మంది ఓట్లు వేశారు. 81,987 మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
ఎన్నికల్లో 1,30,737 మంది పురుషులు, 1,29,081 మంది మహిళలు, ముగ్గు రు ఇతరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిన్నారం మున్సిపలిటీలో అత్యధికంగా 90.98 శాతం పోలింగ్ నమోదైంది. జిన్నారం మున్సిపాలిటీలో 11,350 మంది ఓట్లు వేశారు. అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో 79.4 శాతం ఓటింగ్ నమోదు కాగా, 13,061 మంది ఓట్లు హక్కును వినియోగించుకున్నారు. గడ్డపోతారంలో 10,315 మంది (86.08%), గుమ్మడిదలలో 19,514 మంది (81.56%), ఇంద్రేశంలో 11102 మంది (84.84%), ఇస్నాపూర్‌లో 28,928 మంది(80.55%) ఓట్లు వేశారు. కోహీర్‌లో 8163 మంది(75.36%), నారాయణఖేడ్‌లో 12,839మంది(72.64%), సదాశివపేటలో 29,151(78.82%), సంగారెడ్డిలో 58,613(70.06%), జహీరాబాద్‌లో 56784 మంది(72.04%) ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో రాజకీయపార్టీలు, కౌన్సిలర్ అభ్యర్థుల దృష్టి అంతా ఫలితాలపైనే నెలకొంది. బుధవారం మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎన్నికల అధికారులు బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. కౌన్సిలర్ అభ్యర్థుల రాజకీయ భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్లిప్తమై ఉండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు పోలింగ్ సరళిని విశ్లేషించుకునే పనిలో నిమగ్నమయ్యారు. వార్డుల్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఎన్ని ఓట్లు తమకు వస్తాయోనని లెక్కగట్టే పనిలో కౌన్సిలర్ అభ్యర్థులు బిజీగా గడుపుతున్నారు. కాంగ్రెస్‌పై వ్యతిరేకత తమకు అనుకూలిస్తుందని బీఆర్ఎస్ అంచ నా వేస్తున్నది.
మెజార్టీ కౌన్సిలర్ స్థానాలు బీఆర్ఎస్ దక్కుతాయని బీఆర్ఎస్ నమ్మకంగా ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఓటమి భయం పట్టుకుంది. కాంగ్రెస్ పాలనలో పట్టణాల్లో అభివృద్ధి ్ద అటకెక్కడంతో పాటు అన్నివర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాం గ్రెస్‌కు నష్టం చేకూరుస్తుందని కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేందుకు బుధవారం రాత్రి తమ అభ్యర్థులను క్యాంపునకు పంపినట్లు తెలుస్తుంది. ఈనెల 13న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.
