సంగారెడ్డి, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలిచిన కౌన్సిలర్ స్థానాల మధ్య స్వల్పతేడా ఉంది. సంగారెడ్డి మున్సిపాలిటీల్లో 10, సదాశివపేటలో 8, కోహీర్‌లో 5, అందోల్‌లో 3, నారాయణఖేడ్‌లో 3 కౌన్సిలర్ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. సంగారెడ్డి, సదాశివపేట, కోహీర్ మున్సిపాలిటీల్లో రెబెల్స్ బీఆర్ఎస్ విజయావకాశాలకు గండికొట్టారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో 10 మందికిపైగా బీఆర్ఎస్ రెబెల్స్ పోటీలో నిలిచి పార్టీ విజయావకాశాలను దెబ్బతీశారు. రెబెల్స్ పోటీ నుంచి తొలగితే సంగారెడ్డి చైర్మన్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకునేది. కొన్ని వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యారు. సంగారెడ్డిలోని 33వ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గోవర్థన్నాయక్ కేవలం 16 ఓట్లతో ఓడిపోయారు. ఇలా చాలా వార్డుల్లో బీఆర్ఎస్ స్వల్ప ఓట్లతేడాతో ఓటమికి గురైంది. దీనికి తోడు కాంగ్రెస్ అడ్డగోలు హామీలను ఓటర్లు విశ్వసించి ఓట్లువేయడం బీఆర్ఎస్ విజయాకాశాలు సన్నగిల్లేలా చేసింది. సదాశివపేట, కోహీర్ మున్సిపాలిటీల్లోనూ రెబెల్స్ బీఆర్ఎస్ను దెబ్బతీశారు. సంగారెడ్డి కాంగ్రెస్‌కు 22, సదాశివపేటలో 16, నారాయణఖేడ్‌లో 11, అందోల్‌లో 16, కోహీర్‌లో 8 కౌన్సిలర్ స్థానాలు దక్కాయి .సంగారెడ్డి, సదాశివపేట, అందోల్, నారాయణఖేడ్, కోహీర్ మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాలు కాంగ్రెస్‌కు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఐదు మున్సిపాలిటీల్లో అధికార, ధనబలం కాంగ్రెస్‌కు కలిసివచ్చింది.
సంగారెడ్డి జిల్లాలోని మెజార్టీ మున్సిపాలిటీలపై గులాబీజెండా ఎగురవేసింది. జిల్లాలో 11 మున్సిపాలిటీలకు 6 మున్సిపాలిటీల్లో మెజార్టీ కౌన్సిలర్ స్థానాలను గెలుచుకుని చైర్మన్ పదవులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలకు ఐదు చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇంద్రేశం, జిన్నారం, గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ పీఠాలు బీఆర్ఎస్ ఖాతాలో చేరాయి. జహీరాబాద్ మున్సిపల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ పదవి బీఆర్ఎస్కు దక్కనున్నది. సంగారెడ్డి, సదాశివపేట, కోహీర్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్,కాంగ్రెస్ కౌన్సిలర్ సీట్ల మద్య స్వల్ప తేడా మాత్రమే ఉంది. నారాయణఖేడ్, అందోల్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు శుక్రవారం జరిగింది. ప్రతి మున్సిపాలిటీల్లో ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం నుంచే కౌంటింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు, మద్దతుదారలు, నాయకులు సందడి మొదలైంది. ఒక్కోవార్డు ఫలితం వెలువడిన వెంటనే అభ్యర్థులు విజయోత్సవాల్లో మునిగిపోయారు. విజయం సాధించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపాలిటీ ప్రధాన రహదారులతో పాటు వార్డుల్లో ర్యాలీలు నిర్వహించి గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మున్సిపాలిటీల్లో 22 వార్డులకు 15 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచి చైర్మన్ పీఠం కైవసం చేసుకుంది. గడ్డపోతారం మున్సిపాలిటీలో 18 వార్డులకు 14వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచి చైర్మన్ స్థానం దక్కించుకుంది. గుమ్మడిదలలో నాలుగు, గడ్డపోతారంలో కేవలం 3 కౌన్సిలర్ స్థానాలు మాత్రమే కాంగ్రెస్‌కు దక్కాయి. రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ప్రభావం చూపలేపోయింది. ఇంద్రేశం మున్సిపాలిటీలో 18 వార్డులకుగాను తొమ్మిదివార్డులను బీఆర్ఎస్ గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థి బీఆర్ఎస్కు మద్దతు తెలిపారు. దీంతో ఇంద్రేశం మున్సిపాలిటీలో చైర్మన్ స్థానానికి అవసరమైన మ్యాజిక్‌ఫిగర్ బీఆర్ఎస్ సాధించింది. జిన్నారం మున్సిపాలిటీలో 20వార్డులకు బీఆర్ఎస్ ఎనిమిది కౌన్సిలర్ స్థానాలను గెలుపొందింది. మరో నలుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచారు. దీంతో చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్‌ఫిగర్ బీఆర్ఎస్ సాధించి జిన్నారం మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 26 వార్డులకు 12 కౌన్సిలర్ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. ఇద్దరు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు మద్దతు తెలపటంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ బీఆర్ఎస్ సాధించింది. జహీరాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 37 వార్డులకుగాను 15వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు,ఎక్స్ఆపీషియో ఓట్లతో బీఆర్ఎస్ జహీరాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం కైవసానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సాధించింది. దీంతో జహీరాబాద్ చైర్మన్ పీఠం బీఆర్ఎస్ ఖాతాలో చేరనున్నది.