సిద్దిపేట, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్)లో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మొత్తం 4,60,000 ఓట్లు గల్లంతయ్యాయి. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 86,364 మంది ఓటర్లు మృతిచెందిడంతో వారివి తొలిగించారు.
సర్ ప్రక్రియలో భాగంగా ఈనెల 10వ తేదీ వరకు సిద్దిపేట జిల్లాలో 9,92,967 ఎన్యుమరేషన్ ఫారాలు అందించారు. ఈనెల 17న ప్రకటించిన ముసాయిదాలో 8,74,181 మంది ఓటర్లు ఉన్నారు.జిల్లాలో ఇప్పటి వరకు 88.04 శాతం డిజిటలైజేషన్ పూర్తి అయింది. ఈలెక్కన జిల్లాలో 1,18,786 ఓట్లు ఎగిరిపోయాయి.అనామలీస్ కింద(అక్షరదోషాలు, పేర్లు తప్పులు, పుట్టిన తేదీల్లో తేడాలు తదితరవి) 1,99,183, మ్యాపింగ్ కానివి 27,251, మొత్తం ఎఎస్డీడీ 1,18,786 ఓట్లు కాగా, వీరిలో మృతులు 32,236 మంది , గైర్హాజరు 11,259 మంది , శాశ్వత వలస 58,628 మంది, ఇతరులు 474, ఇప్పటికే నమోదైనవి 16,189 మంది ఉన్నారు.
సంగారెడ్డి జిల్లాలో ఈనెల 10న అందించిన సర్ ఫారాల ప్రకారం 14,57,436 మంది ఉన్నారు. ముసాయిదా జాబితాలో 11,59,158 ఓటర్లు ఉన్నారు. అంటే 2,98,278 మంది ఎగిరిపోయాయి. కాగా, డిజిటలైజేషన్ 79.53 శాతం పూర్తి అయింది. అనామలీస్ 3,47,682 మంది, మ్యాపింగ్ కానివారు 1,12,749 మంది,మొత్తం ఎఎస్డిడి 2,98,278 మంది కాగా వీరిలో మృతులు 40,962 మంది, గైర్హాజర్ 54,135, శాశ్వత వలస 1,59,376 మంది, ఇతరులు 7,275 మంది, ఇప్పటికే నమోదైన వారు 36,530 మంది ఓటర్లున్నారు.
ఈనెల 17న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 11 శాసనసభా నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్లను మించిపోవడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 11 శాసనసభా నియోజకవర్గాలకు నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్ మినహా మిగతా 9 శాసనసభా స్థానాల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. దీంతో రానున్న ఎన్నికల్లో మహిళా ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి.ఈ తొమ్మిది నియోజకవర్గాల్లో పురుషులకన్నా 43,294 మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
మెదక్ జిల్లాలో 10వ తేది వరకు 4,53,140 మంది ఓటర్లు ఉన్నారు. ముసాయిదాలో 4,10,204 మంది ఓటర్లు ఉన్నారు. 90.52 శాతం డిజిటైజేషన్ పూర్తి చేశారు.ఈ జిల్లాలో 42,936 ఓట్లు తొలిగించారు. అనామలీస్ కింద 1,11,689 మంది, మ్యాపింగ్ కాని వారు 6,973 మంది, మొత్తం ఎఎస్డీడీ 42,936 ఓటర్లు కాగా, వీరిలో మృతులు 13,166 మంది, గైర్హాజర్ 1508, శాశ్వత వలస 21,101 మంది , ఇతరులు 314 ,ఇప్పటికే నమోదైన వారు 6,847మంది ఉన్నారు.
