సిద్దిపేట, మే 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పది ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత ఏడాదికన్న మెరుగైన ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా రెండో స్థానంలో నిలిచినప్పటికీ గత సంవత్సరం కంటే ఉత్తీర్ణత శాతం 0.80 పెరిగింది. బుధవారం పది ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాలో 98.65 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది 97.85 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈసారి గతేడాదికన్నా 0.80శాతం ఉత్తీర్ణత పెరిగింది. సిద్దిపేట జిల్లాలో 14,177 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలురు 7,053, బాలికలు 7,124 మంది ఉన్నారు. 13,985 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 6,927 మంది (98.21శాతం), బాలికలు 7,058 మంది (99.07శాతం) పాసయ్యారు. పది ఫలితాల్లో బాలుర కంటే బాలికలదే పై చేయి సాధించారు. ఏప్రిల్ 3 నుంచి 12 వరకు టెన్త్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం 11 పేపర్లకుగానూ ఆరు పేపర్లకు కుదించింది. పదవ తరగతి ఫెయిలైన విద్యార్థులకు జూన్ 14 నుంచి 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం మే 26వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉం టుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల నిరంతర శ్రమ, రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు నిరంతర సమీక్షా, విద్యార్థుల తల్లిదండ్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటి కప్పుడు దిశానిర్దేశం చేయడంతో సిద్దిపేట జిల్లా మంచి ఫలితాలు సాధించింది. రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. గత సంవత్సరం రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈవిద్యా సంవత్సరం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడంతో మంచి ఉత్తీర్ణత శాతంతో ఫలితాలు వచ్చాయి. ఈ సంవత్సరం అన్ని పాఠశాలల్లో ప్రత్యేక తరగతులతో పాటు, ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు అల్పాహారం అందజేశారు. ప్రతి పది మంది విద్యార్థులను ఒక ఉపాధ్యాయుడు దత్తత తీసుకున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపారు.
విద్యార్థుల తల్లిదండ్రులకు ఆత్మవిశ్వాసం నింపేలా ఉత్తరం ద్వారా మంత్రి హరీశ్‌రావు తన సందేశాన్ని పంపారు. విద్యార్థులు.. యువత సాంకేతిక పరిజ్ఞానానికి ఎక్కువగా అలవాటు పడిన విషయం తెలిసిందే.. ఆ దిశగా సాంకేతిక పరిజ్ఞానం చదువుపై అలవాటు పడాలనే ఉద్దేశంతో వీడియో రూపకంగా విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ ద్వారా తరగతులు నిర్వహించారు. డిజిటల్ కంటెంట్‌ను ప్రధానంగా అన్ని సబ్జెక్టుల్లో క్యూఆర్ కోడ్ ద్వారా విద్యార్థులు స్కాన్ చేస్తే వీడియో రూపంలో సంబంధిత సబ్జెక్ట్ వినే అవకాశం కల్పించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 10 వేల మంది విద్యార్థులకు కేసీఆర్ డిజిటల్ కంటెంట్ అనే బుక్స్ పంపిణీ చేశారు.ప్రత్యేక తరగతులు, ఉత్తర సందేశం, డిజిటల్ కంటెంట్.. ఇలా మూడు రకాలుగా ఈ సంవత్సరం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు.విద్యార్థులకు ఏ అవసరం ఉన్నా మేమున్నామని భరోసా ఇచ్చారు. ఈ సారి వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలకు రూ.25 వేలు నగదు బహుమతి ఇస్తామని,అదే విధంగా 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు రూ.10 వేల నగదు బహుమతి అందిస్తానని మంత్రి హరీశ్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. పది ఫలితాలపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టెన్త్‌లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నది. జిల్లా 98.65 శాతం ఉత్తీర్ణత సాధించింది. గతేడాది కన్నా 0.80 ఉత్తీర్ణత శాతం పెరగింది. పక్కా ప్రణాళికతో మంత్రి హరీశ్‌రావు దిశానిర్దేశం, సిద్దిపేట కలెక్టర్, ఉపాధ్యాయులు అందరి సహకారంతో మంచి ఫలితాలు సాధించాం.రాబోయే విద్యాసంవత్సరం అందరి సహకారంతో ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తాం. జిల్లాను ఉన్నత స్థానంలో నిలుపడంలో సహకరించిన ప్రజాప్రతినిధులు,విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు.
– శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి,సిద్దిపేట