సంగారెడ్డి, జూలై 19(నమస్తే తెలంగాణ): రైతులను సంఘటితం చేయడం, వారికి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి తెలియజేయడం, నూతన సాగు విధానాలు, వ్యవసాయంలో సలహాలు, సూచనలు ఇవ్వడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు వేదికలు ఏర్పాటు చేసింది. రైతు వేదికల ఏర్పాటుతో సమావేశాలు నిర్వహించుకోవడానికి అనువుగా మారింది. వ్యవసాయశాఖ క్లస్టర్‌కు ఒక రైతు వేదికను ఏర్పాటు చేసి ఒక్కో రైతు వేదిక నిర్వహణకు ప్రతినెలా రూ.9 వేలు బీఆర్ఎస్ సర్కా రు చెల్లించింది. కాంగ్రెస్ సర్కారు వచ్చాక రైతుల వేదికల నిర్వహణను గాలికి వదిలేసింది.
ప్రభుత్వం రైతువేదికల నిర్వహణ, వాచ్మెన్ వేతనాలు చెల్లించకపోవటంతో వ్యవసాయశాఖ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం నిర్వహించిన వేడుకలకు వ్యవసాయశాఖ అధికారులు సొంతంగా డబ్బులు ఖర్చు చేసినట్లు తెలిసింది. అసలే రైతువేదికల నిర్వహణ నిధులు లేక మండల వ్యవసాయశాఖ అధికారులు ఇబ్బందులు పడుతుంటే, వా రిపై వేడుకల నిర్వహణ భారం పడడంపై అసంతృప్తితో ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో 118, మెదక్ జిల్లాలో 77, సిద్దిపేట జిల్లాలో 127 రైతు వేదికలు ఉన్నాయి.