పటాన్చెరు, ఏప్రిల్ 29 : హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న అమీన్పూర్ మండలంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూములను కొందరు అక్రమంగా కబ్జా చేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నా యి. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములకు సంబంధించి కొం దరు నకిలీ పత్రాలు సృష్టించి, అక్రమంగా కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జేసీబీ యంత్రాలతో ప్రభుత్వ భూమిలోని రాళ్లు, చెట్లు తొలిగిస్తున్నా రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ అండదండలతోనే కొందరు అక్రమార్కులు సర్కారు భూమిని కాజేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అమీన్పూర్ మండలంలోని 343 సర్వేనంబర్‌లో 300 ఎకరాల ప్రభుత్వం భూమి ఉంది.
గతంలో ఇందు లో ప్రభుత్వం 20ఎకరాల భూమిని తెలంగాణ ప్రత్యేక పోలీసు శిక్షణ కేంద్రానికి కేటాయించిం ది. కానీ, ఇక్కడ తెలంగాణ ప్రత్యేక పోలీసు శిక్షణ కేంద్రానికి సంబంధించి ఎలాంటి పనులు చేపట్టలేదు. 343 సర్వేనంబర్‌లో ప్రభుత్వ భూమి తోపాటు ప్రైవేట్ భూమి ఉందని సమాచా రం. కొందరు రాజకీయ నాయకులు తమ అనుచరులతో ప్రభుత్వ భూమిని కబ్జాచేసే ప్రయత్నం చేస్తున్నారని, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేద ని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండు రోజులుగా ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా రాళ్లు, చెట్లు తొలిగించి, భూమి చదును చేస్తున్నా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, జేసీబీ యంత్రాలను సీజ్ చేయడం లేదని రెవెన్యూ అధికారుల తీరు ను స్థానికులు ఎండగడుతున్నారు.
అమీన్పూర్ పెద్ద చెరువుకు సమీపంలో కుమ్మరి కుంట ఉంది. కుమ్మరి కుంటకు సమీపంలోనే 343 సర్వేనెంబర్లో 300 ఎకరాల్లో పెద్ద అటవీ ప్రాంతం ఉంది. పెద్ద చెరువు సమీపంలో ఉండడంతో జంతువులు, పలు రకాల పక్షులు అటవీ ప్రాంతంలో జీవిస్తున్నాయి. ఇక్కడికి ఏటా విదేశీ పక్షలు వలస వస్తున్నాయి. జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. కొందరు అమీన్పూర్లో ఉన్న చెరువులు, కుంటలు కబ్జా చేయడంతో పాటు ప్రభుత్వ భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నం చేసినా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోక పోవడంతో జీవ వైవిధ్యంపై ప్రభావం చూపుతున్నది.
కబ్జా దారులు అటవీ ప్రాంతంలో ఉన్న చెట్లు, రాళ్లు తొలిగించి చదును చేస్తుండడంతో జీవవైవిధ్యంపై ప్రభావం చూపుతున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమీన్పూర్ చెరువులకు ఏటా పలు రకాల విదేశీ పక్షులు వలస వస్తుంటాయి. ఇక్కడే కొద్దిరోజులు ఉండి తిరిగి వెళ్తాయి. ఇప్పుడు వీటి మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. రెవెన్యూ అధికారుల కనుసైగలోనే భూఅక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ భూమిలో జేసీబీలతో చెట్లు, రాళ్లు తొలిగిస్తున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని, తహసీల్దార్, ఆర్ఐలకు సమాచారం అందించినా ఎవరూ ప్రభుత్వ భూమి వద్దకు రాలేదని స్థానికులు తెలిపారు. కబ్జాదారులు జేసీబీలతో చెట్లు నరికివేస్తూ, పెద్దపెద్ద రాళ్లు రప్పులు తొలిగిస్తున్నా చదును చేస్తున్నా చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. జిల్లా స్థాయి అధికారుతో పాటు మండల స్థాయి అధికారుల ప్రోత్సాహంతో కొందరు ఇలా రెచ్చిపోయి సర్కారు భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
అమీన్‌పూర్‌లోని 343 సర్వేనంబర్‌లో కొందరు వ్యక్తులు రాళ్లు, చెట్లు తొలిగిస్తున్నారని మాకు ఫిర్యాదు వచ్చింది. విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అమీన్పూర్ తహసీల్దార్‌ను ఆదేశించాం. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటాం. అమీన్‌పూర్‌లోని ప్రభుత్వ భూములను కాపాడుతాం. కబ్జాదారులకు అధికారులు ఎవరైనా సహకరించినా, ప్రోత్సహించినా వారిపైనా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములు పరిరక్షించాలని ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం.
-రవీందర్‌రెడ్డి, ఆర్డీవో సంగారెడ్డి