వివిధ కారణాలతో మృతిచెందిన రైతు కుటుంబాలకు ‘రైతుబీమా’ కొండంత అండగా నిలుస్తున్నది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి కష్టాలు పడుతున్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం అందించి ఆర్థిక భరోసానిస్తున్నది.18 నుంచి 59 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న అన్నదాతలను అర్హులుగా ప్రకటిస్తూ 2018లో సీఎం కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి రైతుల పక్షానబీమా ప్రీమియాన్ని మొత్తం ప్రభుత్వమే కంపెనీలకు చెల్లిస్తున్నది. రైతు చనిపోయిన అనంతరం వ్యవసాయ శాఖ సిబ్బంది అన్ని పత్రాలు పరిశీలించి డబ్బులు నామినీ అకౌంట్లో జమ చేస్తున్నారు. ఐదేండ్లలో మెదక్ జిల్లాలో 5551 కుటుంబాలకు రూ.277.95 కోట్లు చెల్లించగా, ఈ ఏడాది కొత్తగా 19,136 మంది రైతులకు పట్టాపాసుపుస్తకాలు వచ్చాయి. సంగారెడ్డి జిల్లాలో 6575 బాధితులకు రూ.329 కోట్ల పరిహారం అందజేయగా, 34,222 మంది కొత్త పాసుపుస్తకాలు అందుకున్నారు. వీరంతా రైతుబీమాకు అర్హులు. ఇప్పటివరకు పేర్లు నమోదు చేసుకోని రైతులకు ప్రభుత్వం ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
– సంగారెడ్డి/ మెదక్ నమస్తే తెలంగాణ, జూలై 14
మెదక్, (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి (నమస్తే తెలంగాణ) జూలై 14: రైతు కుటుంబానికి బీమా పథకం కొండంత అండగా నిలుస్తున్నది. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2018లో రైతు బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. గుంట జాగా ఉన్న రైతుకూ ఈ పథకంలో అవకాశం కల్పించి, ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబాన్ని ఆర్థికంగా బీమా సొమ్ము ఆదుకుంటున్నది. రైతుబీమా పథకం కింద ఆ కుటుంబానికి రూ.5 లక్షలు అందజేస్తున్నారు. దీంతో ఆ కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. రైతు మృతిచెందిన వెంటనే రైతు బీమాకు సంబంధించిన అన్ని పత్రాలు వ్యవసాయ శాఖ పరిశీలించి రైతు బీమాను నామినీ అకౌంట్లో జమ అయ్యేలా చూస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం రైతుల మన్ననలు అందుకుంటుంది.
రైతు బీమా కింద రూ.5 లక్షలు
తెలంగాణ ప్రభుత్వం 18 నుంచి 59 ఏండ్ల మధ్య వయస్సున్న రైతులకు 2018 ఆగస్టు 15 నుంచి రూ.5 లక్షలు రైతు బీమా కింద జమచేస్తున్నది. ఏ రైతు మరణించినా ఆయన కుటుంబానికి రూ.5 లక్షల బీమా కవరేజ్ లభిస్తుంది. రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తున్నది. కారణం ఏదైనా రైతు మృతిచెందితే ఆ కుటుంబం ఈ పథకం కింద రూ.5 లక్షల నష్ట పరిహారం పొందుతున్నది. రైతు కుటుంబంలోని నామినీ ఖాతాలో పది రోజుల వ్యవధిలోనే రూ.5 లక్షలు జమ చేస్తున్నారు. నామినీ నమోదుకు రైతు బీమా దరఖాస్తు, ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ తీసుకుని వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద సంతకం చేసి ఇవ్వాలి.
మెదక్ జిల్లాలో 5551 మంది లబ్ధిదారులు
2018-19 సంవత్సరంలో 1,08,982 మంది రైతులు, 2019-20లో 1,16,897 మంది, 2020-21లో 1,33,556 మంది, 2021-22లో 1,49,210 మంది రైతులు అర్హులుగా గుర్తించారు. 2022-23లో 1,41,029 మంది రైతులు. ఇందులో 2018లో 707 మంది రైతులకు రూ.35.35 కోట్లు, 2019లో 864 మందికి రూ.43.20 కోట్లు, 2020లో 1397 మందికి రూ.69.85 కోట్లు, 2021లో 1175 మందికి రూ.58.75 కోట్లు, 2022లో 529 మందికి రూ.26.45 కోట్లు, 2023లో 889 మందికి రూ.44. 45 కోట్లు జమ అయ్యాయి. మొత్తం ఐదేండ్లలో 5551 మంది రైతు కుటుంబాలకు రూ.277.95 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా కింద జమ చేసింది.
సంగారెడ్డిలో 6575 కుటుంబాలకు రూ.329 కోట్లు
సంగారెడ్డి జిల్లాలో రైతుబీమా పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 6575 రైతు కుటుంబాల్లోని నామినీలకు రూ.329 కోట్ల ఆర్థిక సాయం అందింది. జిల్లాలో ఏటా రైతు బీమా పథకం కింద రైతులు పేర్లు నమోదు చేసుకుంటున్నారు. బీమా చేసుకున్న రైతులు మృతి చెందితే నామినీకి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. 2018-19లో 1,46,287 మంది రైతు బీమాలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 1054 మంది రైతులు మృతి చెందారు. వారి కుటుంబాల్లోని నామినీలకు రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.52.07 కోట్లు అందజేశారు. 2019-20లో 1,50,005 మంది రైతులు రైతు బీమాకు అర్హత పొందారు. ఇందులో 1158 మంది రైతులు మృతి చెందగా, రూ.57.09 కోట్లు, 2020-21లో 1,53,795 మంది రైతుబీమా చేసుకున్నారు. వీరిలో 1928 మంది రైతులు మృతి చెందగా రూ.96.4 కోట్లు అందజేశారు. 2021-22లో 1,69,358 మందిలో 1410 మంది మృతి చెందారు. నామినీలకు రూ.70.5 కోట్లు అందజేశారు. 2022-23లో 1,81,510 మంది రైతు బీమాలో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 1025 మంది మృతి చెందారు. వారి కుటుంబాలకు రూ.51.25 కోట్లు అందజేశారు. మొత్తం ఐదేండ్లలో 6576 రైతు కుటుంబాలకు రూ.329 కోట్ల ఆర్థిక సాయం అందజేశారు.
ఈ ఏడాది కొత్తగా నమోదైన రైతులు
మెదక్ జిల్లాలో ఈ ఏడాది కొత్తగా 19,136 మంది రైతులు, సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 34,222 మంది రైతులు పట్టా పాసు పుస్తకాలు పొందారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తులను వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులు స్వయంగా వెళ్లి సమర్పించాల్సి ఉంటుంది. కొత్త పాలసీ ఆగస్టు 14 నుంచి అమల్లోకి రానున్నది. వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ రైతు బీమా పథకంపై అవగాహన కల్పిస్తూ, దరఖాస్తులు అందజేస్తున్నారు. పేర్లు నమోదు చేసుకునే వారు దరఖాస్తు ఫారం, పట్టదారు పాసు పుస్తకం, రైతు ఆధార్‌కార్డు, నామినీ ఆధార్‌కార్డు జిరాక్స్ పత్రులను తమ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలి. వచ్చే నెల 5వ తేదీలోగా అర్హులైన రైతులు తమ పేర్లను రైతు బీమా పథకంలో నమోదు చేసుకోవాలి.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
రైతు బీమా దరఖాస్తు చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. రైతు చనిపోయిన వెంటనే ఏఈవోలు రైతుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. అన్నీ ఒకే అనుకున్న తర్వాత సంస్థ నుంచి నేరుగా రూ.5 లక్షలు బాధిత నామినీ ఖాతాలో జమ అవుతున్నాయి. రైతు బీమా పొందడానికి రైతులు ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రీమియం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. – ఆశాకుమారి,
వ్యవసాయ శాఖ జిల్లా అధికారి, మెదక్
ఆపద కాలంలో ఆదుకునే పథకం
ఆపద కాలంలో రైతు కుటుంబాన్ని ఆదుకునే గొప్ప పథకం రైతు బీమా. రైతు బీమా పథకంలో ఏటా అర్హులైన రైతుల పేర్లు నమోదు చేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఐదేండ్లలో రైతు బీమా పథకం ద్వారా 6575 కుటుంబాలకు రూ.329 కోట్ల ఆర్థిక సాయం అందజేశాం. ప్రస్తుతం రైతు బీమా పథకంలో అర్హులైన రైతుల పేర్లు నమోదు చేస్తున్నాం. జిల్లాలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయశాఖ సిబ్బంది పర్యటిస్తూ ఈ పథకంపై రైతులకు అవగాహన కల్పించి, దరఖాస్తులు అందజేస్తున్నారు. వచ్చే నెల 5వ తేదీలోగా జిల్లాలోని అర్హులైన రైతులు రైతుబీమా పథకంలో పేర్లు నమోదు చేసుకోవాలి. ఇది వరకే రైతుబీమా పథకం చేయించుకున్న రైతులు ఆధార్ కార్డు, నామినీ వివరాల్లో మార్పులు చేయాల్సి ఉంటే ఈనెల 25లోగా మండల వ్యవసాయ విస్తరణ అధికారికి తెలియజేయాలి.
– నర్సింహారావు, వ్యవసాయశాఖ జిల్లా అధికారి సంగారెడ్డి