సిద్దిపేట, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘డిజిటల్ క్రాప్ సర్వే చేయాల్సిందే.లేకుంటే మీ ఉద్యోగాలు పోతాయి. సర్వే ఎందుకు చేయరు? మీరు ఏమనుకుంటున్నారు. మీరు కచ్చితంగా క్రాప్ సర్వే చేయాల్సిందే.ఎవరెవరు చేయడం లేదో మీ మీడేటాను సేకరిస్తున్నాం’..అంటూ ఔట్సోర్సింగ్ వ్యవసాయ విస్తరణ అధికారులకు ఆ శాఖ ఉన్నతాధికారుల బెదిరిస్తున్నారు. పగలు,రాత్రి అనే తేడాలేకుండా వారికి మెసేజ్‌లు పెడుతున్నారు.తక్షణమే డిజిటల్ పంట సర్వే మొదలు చేయకపోతే నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి తొలిగిస్తామని హెచ్చరిస్తున్నారు.
జిల్లాలో ఓ నలుగురి ఉద్యోగాలు పీకేస్తే మీరంతా దారికి వస్తారంటూ సిద్దిపేట జిల్లా స్థాయి అధికారి హెచ్చరిస్తున్నట్లు సమాచారం.ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు రెగ్యులర్ ఏఈవోల తప్పులను చూపుతూ వారిని సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధ్దం చేస్తున్నారు. ఔట్సోర్సింగ్ వారితో పాటు ఒకరిద్దరు రెగ్యులర్ ఉద్యోగులను పక్కన పెడితేనే భయంతో సర్వేకు వెళ్తారని ఉన్నతాధికారుల భావన. ఏదో రకంగా భయపెట్టి డిజిటల్ క్రాప్ సర్వే చేయించాలని ఉన్నతాధికారులు చూస్తున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ డిజిటల్ సర్వే చేసేది లేదని వ్యవసాయ విస్తరణ అధికారులు చెబుతున్నారు.
మిగతా రాష్ర్టాల్లో ఎలా సర్వే చేయిస్తున్నారో మన రాష్ట్రంలో కూడా అలానే చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.వ్యవసాయ శాఖలోని వివిధ పనులు చేస్తూనే డిజిటల్ సర్వే చేయాలంటే తమ నుంచి కాదని వారు చెబుతున్నారు.ఒక్క ఏఈవో సరాసరిగా 20వేల ఎకరాలు సర్వే చేయడం సాధ్యమవుతుందా..?అని వారు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికే క్రాప్ కటింగ్ వచ్చిందని, ప్రస్తుతం పంట క్రాప్ సమయంలో డిజిటల్ సర్వే ఎలా చేయగలుగుతామని వారు అంటున్నారు. పంట చేతికి రావడంతో మామీద మరింత పనిభారం పెరగిందని చెబుతున్నారు.
రైతుబీమా, రుణమాఫీ, పంట నష్టం సర్వే, పంటల నమోదుతో పాటు ఇతర పనుల్లో బిజీగా ఉన్న తాము, ఇప్పుడు పంటలు కోతకు రావడంతో కొనుగోళ్లు చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. దొడ్డు వడ్లు, సన్నాలు గుర్తించాల్సి ఉంటుందని, తీవ్ర పనిఒత్తిడి ఉందని ఏఈవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే తమతో చేయించవద్దని ఔట్సోర్సింగ్ ఏఈవోలు జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్లకు, వ్యవసాయ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. వ్యవసాయ వృత్తి విద్య కోర్సులు చదివి, అతి తకువ జీవితంతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఏఈవోలపై ఉన్నతాధికారుల వేధింపు చర్యలను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఏఈవోలకు రెగ్యులర్ ఏఈవోలు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. వీరిపై కక్షపూరిత చర్యలు మానుకోకపోతే నిరవధిక సమ్మె చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని రెగ్యులర్ ఏఈవోలు చెబుతున్నారు.
డిజిటల్ పంట సర్వేను కచ్చితంగా ఏఈవోలు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఒత్తిడి తెస్తున్నారు. ఇతర రా ష్ట్రాల మాదిరిగా చేయించకుండా తమమీద పనిభారం మోపుతున్నారని ఏఈవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఏఈవో 15 నుంచి 20వేల ఎకరాల్లో సర్వే చేయాలంటే తమవల్ల కాదని ఏఈవోలు యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా నిరసన తెలుపుతున్నారు. డిజిటల్ క్రాప్ పనులు చేయకపోతే గైరాజరు వేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఉన్నతాధికారులు భయభ్రాంతులకు గురిచేస్తుండడంతో దికుతోచని స్థితిలో ఏఈవోలు, కాంట్రాక్ట్ ఏఈవోలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 319 మంది ఏఈవోలు పని చేస్తున్నారు. వీరిలో రెగ్యులర్ ఏఈఓవోలు 265 మంది, ఔట్ సోర్సింగ్‌లో 54 మంది పని చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో రెగ్యులర్ ఉదోగులు 90 మంది, అవుట్ సోర్సింగ్‌లో 37 మందితో కలిపి 127 మంది పని చేస్తున్నారు. మెదక్ జిల్లాలో రెగ్యులర్ ఉదోగులు 68మంది, అవుట్ సోర్సింగ్‌లో 8 మందితో కలిపి 76 మంది, సంగారెడ్డి జిల్లాలో రెగ్యులర్ ఉదోగులు 107మంది, అవుట్ సోర్సింగ్‌లో 9మందితో కలిపి 116 మంది పనిచేస్తున్నారు.
వీరితోనే క్రాప్ డిజిటల్ సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి ఏఈవో 25 మీటర్లలోపు నుంచి యాప్‌లో ఫొటోను తీసి అప్లోడ్ చేయాల్సి ఉం టుంది. ఆ పరిధిలో మాత్రమే యాప్ ఓపెన్ అవుతుంది. సర్వేనెంబర్ల ఆధారంగా ఏఏ పంటలు ఎన్ని ఎకరాల్లో వేశారు అనే వివరాలను ఆ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో కొన్ని ప్రాంతాలు ఎత్తయినవి ఉం టాయి. కొన్ని గుట్ట ప్రాంతాలు , వాగులు అవతలి, ఇవతలి ప్రాంతాలతో పాటు సరైన బాటలు లేకపోవడంతో కొన్ని భూములకు పోయి సర్వే చేయాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని సర్వే నెంబర్లకు బై నెంబర్లు ఉంటాయి.
వాటి విషయంలో రెవెన్యూ అధికారుల సహకారం లేనిది ఏమాత్రం చేయరాదు. మహిళా ఉద్యోగులు కొండలు, గుట్టలు ప్రాంతాలకు వెళ్లాలంటే సాధ్యమయే పనికాదు. వీటన్నింటిని దాటుకొని సర్వే చేయాల్సి ఉంటుంది.కొండలు, గుట్టలు, అటవీ భూముల్లో పంట సర్వేకు ఒంటరిగా వెళ్లిన సందర్భాల్లో ఏఈవోలు అనుకోని ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతే రెగ్యులర్ ఏఈవోల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా అండదండలు ఉంటాయి. వ్యక్తిగత ప్రమాదబీమా వర్తించడంతో పాటు వీరి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ, కాంట్రాక్టు ఏఈవోలకు ఎలాంటి ఉద్యోగ భద్రత, ప్రయోజనాలు లేవు.
తెలంగాణలో క్రాప్ డిజిటల్ సర్వే బాధ్యతను ఏఈవోలకు ప్రభుత్వం అప్పగించింది. మిగతా రాష్ర్టాల్లో వెయ్యి నుంచి రెండు వేల ఎకరాలకు గ్రామ వ్యవసాయ సహాయకుడిని నియమించారు.వారితో డిజిటల్ సర్వే చేయిస్తున్నారు. ఒక సర్వే నెంబరులో ఒక ఫొటోకు కేంద్ర ప్రభుత్వం రూ.10 చొప్పున ఇవ్వనున్నది. ఈ డబ్బులతో ఇతర రాష్ర్టాల్లో వ్యవసాయ సహాయకులకు ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చి చేయిస్తున్నారు.
తెలంగాణలో మాత్రం ఆ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉంచుకొని ఏఈవోల మీద పనిభారం రుద్దుతున్నది. ఇప్పటికే తమపై పనిభారం ఎక్కువైందని వారు వాపోతున్నారు. డిజిటల్ సర్వే ప్రధాన ఉద్దేశం భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఆహార భద్రత, పంటల బీమా, ప్రకృతి వైపరీత్యాలతో జరిగే పంట నష్టాన్ని అంచనా వేయడం, ఆహార ధాన్యాల ఎగుమతి పంటల కొనుగోలు సాగు ప్రణాళిక మార్కెటింగ్ తదితర అవసరాల నిమిత్తం డిజిటల్ పంట సర్వే ప్రధాన భూమిక పోషించనున్నది.
ఇందులోభాగంగానే వ్యవసాయరంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రూపొందించే లక్ష్యంతో డిజిటల్ అగ్రిమిషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. దీనిని అమలు చేయడానికి రాష్ర్టాలకు కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించిం ది. దేశవ్యాప్తంగా దీనికి రూ.2,817 కోట్లు కేటాయించింది. రైతులకు ప్రయోజనం చేకూర్చటానికి, వ్యవసాయ సామర్థ్ధ్యాన్ని పెంచటానికి ఆధునిక సాంకేతికను వినియోగించనున్నది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహిస్తుంది. ఏఈవోలకు గతంలోనే ట్యాబ్ అం దించినా ప్రస్తుతం అవి పనిచేయడం లేదు .దీంతో సొంత ఫొన్లలోనే ఫొటో లు తీసి వివరాలు నమోదుచేయాల్సి వస్తుందని ఏఈవోలు చెబుతున్నారు.