మెదక్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వచ్చే ఏప్రిల్ మాసం నుంచి జిల్లాలోని 2,14,890 రేషన్ కార్డుదారులకు 529 చౌక ధర దుకాణాల ద్వారా పోర్టిఫైడ్ బియ్యాన్ని అందించనున్నామని జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు. జాతీయ ఆహార భద్రతలో భాగంగా గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విజిలెన్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మినరల్స్, ఐరన్‌తో కూడిన బలవర్థకమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు, అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకానికి పాఠశాలలకు, సంక్షేమ వసతి గృహాలకు పోర్టిఫైడ్ బియ్యాన్ని అందించాలని నిర్ణయించిందన్నారు. ఇప్పటికే కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో, వసతి గృహాల్లో పోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. పోషకాహార లోపం వల్ల చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారని, పిల్లల్లో వయస్సుకు తగ్గ ఎదుగుదల లేదని గుర్తించిన ప్రభుత్వం పోర్టిఫీడ్ బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించిందన్నారు. జిల్లాలోని 7 మండల స్థాయి స్టాక్ పాయింట్ల ద్వారా ప్రతి నెలా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు పోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేస్తామన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు పోషకాహారంతో పాటు అదనపు పోషణకు అనుబంధ ఆహారం అందించాలని సూచించారు. బియ్యం నాణ్యతలో రా జీ పడొద్దని ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సంక్షేమ అధికారులకు సూచించారు. సరైన పౌష్టికాహారం లేక చాలా మంది పిల్లలు వయస్సుకు తగ్గ ఎదుగుదల లేక ఆరోగ్య సమస్యలు ఎదురొంటున్నారని, మారుతున్న కాలానికనుగుణంగా పండ్లు, తృణ ధాన్యాలు వంటి విటమిన్లతో కూడిన అనుబంధ ఆహారం అందించాలన్నారు. ఏ ఒకరూ ఆకలితో చావకూడదన్నదే ఆహార భద్రత చట్టం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో వెంకట శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీఎస్వో శ్రీనివాస్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీ, లీగల్ మెట్రాలజీ అధికారి సుధాకర్, వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.