ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Jun 22, 2020 , 23:10:02

పచ్చదనం పరిఢవిల్లేలా..

పచ్చదనం పరిఢవిల్లేలా..

పుడమి తల్లికి పచ్చని చీర చుట్టేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఏటా చేపడుతున్న పచ్చని పండుగను ఈ సారి కూడా పెద్ద ఎత్తున కొనసాగించేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు, అధికారులు సిద్ధమవుతున్నారు. ఐదు విడుతల్లో నాటిన మొక్కలు ఇప్పటికే చెట్లుగా మారి పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. 

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమ నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. అడవులు అంతరించిపోవడం, పచ్చదనం తగ్గిపోతుండడంతో సరిపడా వర్షాలు పడక భూగర్భజలాలు తగ్గుతున్న పరిస్థితులను గుర్తించిన ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 5 విడుతలుగా హరితహారం నిర్వహించారు. ఈ నెల 25 నుంచి ఆరో విడుత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఉమ్మడి జిల్లాలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలుండగా, 1,719 వరకు నర్సరీలున్నాయి. ఈ విడుతలో ఉమ్మడి జిల్లాలో 1.68 కోట్ల వరకు మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా ప్రభుత్వ శాఖలకు కలెక్టర్లు టార్గెట్లు నిర్దేశించారు. ఇదిలాఉండగా కొత్తగా నిర్మించిన రిజర్వాయర్ల కాల్వల పక్కన, చెరువుల కట్టలపై మరో కోటి మొక్కలు అదనంగా నాటేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఇటీవలే అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

నర్సాపూర్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరో విడుత హరితహారం కార్యక్రమానికి నర్సాపూర్‌ అడవిలో నిర్మించిన ఎకోపార్కు వేదికకానున్నది. ఈనెల 25న ప్రారంభించనున్న హరితహారం కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ రానున్నట్లు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తెలిపారు. సోమవారం నర్సాపూర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ మురళీయాదవ్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆరో విడుత   హరితహారం ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ వస్తున్న నేపథ్యంలో మంగళవారం మంత్రి హరీశ్‌రావు ఏర్పాట్లు పరిశీలించనున్నారని తెలిపారు. సమావేశంలో కమిషనర్‌ నవీన్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ నహీం, కౌన్సిలర్లు తదితరులున్నారు.

నిర్లక్ష్యం వహిస్తే పదవులకే ఎసరు...

పచ్చదనం పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాల్లో పచ్చదనం పరిరక్షణ అంశాన్ని పొందుపరిచిన విషయం తెలిసిందే. నాటిన మొక్కల్లో 85శాతం మొక్కలు లేకున్నా, పెరుగకపోయినా ప్రజాప్రతినిధులు అం టే సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్ల పదవులు ఊడిపోతాయన్నమాట. కొత్త చట్టం ప్రకారం గ్రామాల్లో పచ్చదనం లోపించినా, నాటిన మొక్కలను సంరక్షించకపోయినా ప్రథమ పౌరుడైన సర్పంచ్‌తో పాటు గ్రామ పంచాయతీ సెక్రటరీల ఉద్యోగాలకు ఎసరు వచ్చే ప్రమాదం ఉన్నది. తమ గ్రామం, మున్సిపాలిటీలో నాటిన మొక్కలు పెరిగినట్లు కనిపించడం లేదని ఫిర్యాదులు అందినా చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో సర్పంచ్‌, కార్యదర్శులు, మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో పచ్చదనం పరిరక్షణకు ప్రత్యేకంగా కృషి చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా అభినందిస్తున్న విషయం తెలిసిందే. అధికారులు, ప్రజాప్రతినిధులే కాకుండా మానవాళి మనుగడకు మూలమైన పచ్చదనం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరుతున్నారు.

లక్ష్య సాధనకు అధికారులతో సమీక్షలు

ఉమ్మడి జిల్లాలో హరితహారం లక్ష్య సాధన కోసం సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ మూడు జిల్లాల కలెక్టర్లు అధికారులు ప్రత్యేకంగా సమీక్షలు జరుపుతున్నారు. హనుమంతారావు, వెంకట్రామ్‌రెడ్డి, ధర్మారెడ్డిలు అన్నిశాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ టార్గెట్లు కూడా నిర్దేశించారు. ఈ మేరకు టార్గెట్లను తప్పకుండా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఉపాధి హామీ నుంచి ఉప్పటికే మూడు జిల్లాల్లో లక్షలాది గుంతలు తీసిపెడుతున్నారు. ఫారెస్ట్‌ శాఖల ఆధ్వర్యంలో అటవీ ప్రాంతాల్లో భూములను చదును చేస్తూ గుంతలు తీస్తున్నారు. ప్రత్యేకంగా ట్రాక్టర్లు, డోజర్లు ఏర్పాటు చేసి పనులు చేపడుతున్నారు. అత్యధికంగా డీఆర్డీఏకు టార్గెట్‌ భారీగా ఉన్నది. డీఆర్డీఏ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు మొక్కలు ఇచ్చి ఇండ్ల పరిసరాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు ఉమ్మడి జిల్లాలోని 1719 నర్సరీల్లో పండ్లు, ఇతర మొక్కలు సిద్ధం చేసి పెట్టారు.

పచ్చని మెతుకుసీమ తయారు కావాలి

హరితహారంపై అన్నిశాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ నెల 25 నుంచి మూడు జిల్లాల్లో మొక్కలు నాటాలి. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించుకోవడం అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల బాధ్యత. మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం నాటిన మొక్కలను సంరక్షించని పక్షంలో ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలుంటాయి. మూడు జిల్లాలకు ఇచ్చిన టార్గెట్లు కాకుండా పెద్దఎత్తున నిర్మాణం జరిగిన కాలువల పక్కన మరో కోటి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. కొండపోచమ్మ, రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్‌ రిజర్వాయర్ల నుంచి పంట పొలాలకు నీరందించే కాలువలు, చెరువు కాలువలు, కట్టలపై పెద్దసంఖ్యలో మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలి. మెతుకుసీమకు హరితశోభ తీసుకువచ్చే బాధ్యత అందరిపై ఉన్నది. అన్నివర్గాల ప్రజలు బాధ్యతగా తీసుకుని తమ ఇల్లు, దుకాణం, వ్యాపార, వాణిజ్య సంస్థల పక్కన నాటిన మొక్కలను రక్షించుకోవాలి. - తన్నీరు హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రిlogo