మెదక్, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో మెదక్, కౌడిపల్లి, వెల్దుర్తి, కొల్చారం, రామాయంపేట, నిజాంపేట, చేగుంట, మాసాయిపేట, పాపన్నపేట, హవేళీఘనపూర్ మండలాల్లో వరి పంట అధికంగా ఎండుముఖం పట్టింది. పంటలను కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల రోజులుగా భూగర్భ జలాలు వేగంగా పడిపోవడంతో వరి పంటకు బాగా దెబ్బతిన్నది. పంటలను కాపాడుకోవడానికి రైతులు అబోర్లు తవ్వించి అప్పుల పాలవుతున్నారు. అయినా నీళ్లుపడక పంటలు ఎండిపోతుండడంతో రైతులు గొర్రెలు, పశువులకు మేతగా వదిలేస్తున్నారు.
కొంతమంది రైతులు కిలోమీటర్ల కొద్ది కాలువలకు పైపులు వేసుకొని నీళ్లు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బోర్ల ఆధారంగా సాగుచేసిన చోటనే ఎక్కువగా పంటలు ఎండిపోయాయి. ఎండిపోయిన పంటలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పంటలపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తున్నామని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి వినయ్‌కుమార్ తెలిపారు. 350 ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్లు అధికారులు తెలిపారు. కానీ, వేలాది ఎకరాల్లో పంటలు ఎండినట్లు రైతులు, రైతు నాయకులు చెబుతున్నారు.
మెదక్ జిల్లాలో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. రోజురోజుకూ భూగ ర్భ జలాలు అడుగంటుతుండడం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. జనవరిలో సాధారణ నీటిమట్టం 10.94 మీటర్లు కాగా, ఫిబ్రవరి నెలలో 13.25 మీటర్లకు పడిపోయింది. అంటే భూగర్భ జలాలు దాదాపు -0.99 మీటర్ల లోతుల్లోకి వెళ్లాయి. ఈసారి వర్షాకాలంలో సాధారణ వర్షపాతమే నమోదైంది. ఒకేసారి దంచికొట్టిన వానలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండాయి. ఆ తర్వాత వర్షాలు కురవలేదు. జిల్లాలో చాలా చెరువులు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది.
ఇప్పటికే మెదక్, నర్సాపూర్, తూప్రాన్ డివిజన్ల్లో బోర్లు ఎత్తిపోతుండగా, నీటిబావులు ఎండిపోతున్నాయి. దీంతో బోరుబావుల కింద వేసిన పంట పొలాలు నీరు లేక ఎండిపోతున్నాయి. రోజురోజుకూ ఎండలు ముదరడంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోనూ నీరు తగ్గుముఖం పడుతోంది. జిల్లాలో అధిక మొత్తంలో వరి సాగు చేయడంతో నీటి వాడకం పెరగడంతో భూగర్భ జలాలు వేగంగా తగ్గుముఖం పట్టాయి. నెల వ్యవధిలోనే జిల్లాలో సరాసరిగా 1 మీటర్ల లోతులోకి భూగర్భ జలాలు పడిపోయాయి. నీటి వాడకం ఇదేవిధంగా కొనసాగితే ఏప్రిల్, మేలో భూగర్భ జలాలు మరింత పడిపోయే అవకాశం ఉంటుందని, దీంతో తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురవుతాయని సంబంధిత శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.