తొగుట, సెప్టెంబరు 16: సాగు నీటి గోస తీర్చడానికి అపర భగీరథుడు కేసీఆర్ హయాంలో నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్టులో నీటి నిలువ ఈ ఏడాది 18.90 టీఎంసీలకు చేరుకుంది. గతేడాది 16.20 టీఎంసీల నీటిని నింపగా ఈసారి 18.90 టీఎంసీల వరకు నీటిని నింపారు. గతంలో ఉన్న 16.20 టీఎంసీల నీటిలో 5.80 టీఎంసీల నీటిని కొండపోచమ్మ సాగర్‌కు తరలించగా, ఈ సంవత్సరం ఎత్తిపోతల ద్వారా 10.40 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో ప్రస్తుత నీటి నిల్వ 18.90 టీఎంసీలకు చేరింది.
మల్లన్న సాగర్‌లో నీటి నిల్వ మూలంగా ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు సరిహద్దు జిల్లాలైన ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్, హైదరాబాద్ తదితర జిల్లాలకు సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలు తీరనున్నాయి. వాస్తవానికి ప్రాజెక్టులో 21 టీఎంసీల నీటిని నిల్వ చేసే ఉద్దేశంతో ఎత్తిపోతల కార్యక్రమం నిర్వహించారు. శ్రీరాంసాగర్ ద్వారా వస్తున్న వరదను మిడ్ మానేరులో నిల్వ చేసి అక్కడి నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ ద్వారా మూడు అంచెల ఎత్తిపోతలను నిర్వహించారు.