సంగారెడ్డి, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో పారిశుధ్యం పడకేయడంతో విషజ్వరాలు పంజావిసురుతున్నాయి. విపరీతంగా దోమలు పెరిగి డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రభు త్వం, అధికారులు ప్రజారోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. గడిచిన మూడు నెలల్లో సంగారెడ్డి జిల్లాలో 279 డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్ దవాఖానల్లోనూ వందల సంఖ్యలో డెంగీ కేసులు నమోదై రోగులు చికిత్స పొందుతున్నారు.ఇటీవల హత్నూర మండలం కొన్యాల గ్రామానికి చెందిన శిశువు దశ్విక్ డెంగీతో మృతిచెందాడు.
జిల్లాలో డెంగీ బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. సంగారెడ్డి, సదాశివపేట, అందోల్, పటాన్చెరు మున్సిపాలిటీల పరిధిలో, జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని గ్రామాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ పడకేసింది. వారంలో ఒకరోజు నిర్వహించే డ్రైడే మొక్కుబడిగా సాగుతోంది. దీంతో డెంగీ, టైఫాయిడ్, ఇతర విషజ్వరాలతో జనం సతమతమవుతున్నారు. డయేరియా కేసులు పెరుగుతున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో ఆందోళనకర స్థాయిలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో సరైన చికిత్స లభించక చాలామంది ప్రైవేట్ దవాఖానల్లో చేరుతున్నారు. వైద్యానికి భారీగా ఖర్చు చేయాల్సి వస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో ఈ సీజన్లో ఇప్పటి వరకు 279 డెంగీ కేసులు నమోదయ్యాయి. జూలైలో 70, ఆగస్టులో 171, ఈనెల ఇప్పటి వరకు 38 కేసులు నమోదయ్యాయి. డెంగీ నిర్ధారణ పరీక్షలకు రోగులు పెద్దసంఖ్యలో దవాఖానలను ఆశ్రయిస్తున్నారు.
డెంగీ రోగుల కోసం సంగారెడ్డిలోని జనరల్ దవాఖానలో ప్రత్యేకంగా ఒకవార్డు ఏర్పాటు చేశారు. డెంగీతో పాటు జిల్లాలో టైఫాయిడ్ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. జూలైలో 356, ఆగస్టులో 134, ఈనెల ఇప్పటి వరకు 25 టైఫాయిడ్ కేసులు రిపోర్టు అయ్యాయి. డయేరియా కేసులు జూలైలో 348, ఆగస్టులో 275, ఈనెలలో 92 కేసులు నమోదయ్యా యి. జిల్లా యంత్రాంగం ఇకనైనా మే ల్కొని చర్యలు చేపట్టాలని ప్రజ లు కోరుతున్నారు.