సంగారెడ్డి, మార్చి 2: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 7నుంచి 11 వరకు జరిగే మెదక్ జిల్లా ఏడుపాయల దుర్గమ్మ ఆలయ జాతరకు 167 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ ప్రభులత శనివారం మీడియాకు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్ధం మెదక్, జోగిపేట్, సంగారెడ్డి, నర్సాపూర్, బాలానగర, సదాశివపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, ఝురాసంగం, శంకరంపేట, బొడ్మట్‌పల్లి, శంకర్పల్లి, జేబీఎస్‌ల నుంచి ఈ బస్సులు నడుస్తాయని తెలిపారు. ఆర్టీసీ బస్సు ప్రయాణిలకులను అమ్మవారి గుడికి సమీపం వరకు చేరుస్తామని తెలిపారు.
మెదక్ నుంచి ఏడుపాయల జాతరకు 11బస్సులు, జేబీఎస్-బాలానగర్ నుంచి 33, నర్సాపూర్ నుంచి 7, శంకరంపేట నుంచి 8, బొడ్మట్‌పల్లి నుంచి 8 బస్సులు నడుపుతారు. హైదరాబాద్ నుంచి జాతరకు 12 బస్సులు, సంగారెడ్డి నుంచి 19, సదాశివపేట నుంచి 13, జోగిపేట నుంచి 7, జహీరాబాద్ నుంచి 18, జహీరాబాద్-ఝరాసంగం నుంచి 6, సిద్దిపేట నుంచి 3, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నుంచి 2, శంకరంపేట నుంచి కొప్పోల్ వరకు 10, టేకులగడ్డ నుంచి దుర్గామాత ఆలయం వరకు 10 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్ఎం ప్రభులత తెలిపారు. సాధారణ చార్జీలతోనే ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తామని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.