సంగారెడ్డి, జూన్ 2: సంగారెడ్డి జిల్లాలో జాతీయ జెండా రెపరెపలాడింది. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాలను ఎగురవేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండా ఎగురవేశారు. కలెక్టరేట్ ముందున్న రహదారిపై తెలంగాణ తల్లి విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఉద్యమ నేత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరాష్ట్రం సాధించి ప్రజల కల నిజం చేసిన గొప్ప నాయకుడన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఎం.ఏ హకీమ్, సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నరహరిరెడ్డి, నాయకులుశ్రీహరి, విజేందర్రెడ్డి, మండల పార్టీల అధ్యక్షులు విఠల్, చక్రపాణి, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు.